హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదసంస్థ వ్యవస్థాపకుడు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళకేసు నిందితుడు యాసిన్ భత్కల్ ఇవాళ హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్టువద్ద కలకలం సృష్టించాడు. అతనిని కేసు విచారణకోసం ఇవాళ కోర్టులో హాజరు పరచటానికి తీసుకొచ్చినపుడు వ్యాన్లోనుంచి ఒక లేఖ విసిరాడు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల సాయంతో చర్లపల్లి జైలునుంచి తాను తప్పించుకోబోతున్నానని ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు పోలీసులు సృష్టించినవేనని ఆ లేఖలో పేర్కొన్నాడు. తనను అంతమొందించటానికి ఇది పోలీసులు పన్నిన కుట్ర అని ఆరోపించాడు. మరోవైపు భత్కల్ తల్లి రిహానా మీడియాతో మాట్లాడుతూ, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విడిపించటానికి వస్తారని తన కొడుకు ఎప్పుడూ చెప్పలేదని చెప్పింది. పోలీసులనుంచి ప్రాణహాని ఉన్నట్లు మాత్రమే చెప్పాడని తెలిపింది. తన కుమారుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయాందోళనలు వ్యక్తం చేసింది.