వైసీపీ కొత్త పాలసీ ప్రకటించింది. పార్టీ నేతలు వేరు.. పార్టీ సానుభూతిపరులు వేరని..సానుభూతిపరుల మాటలకు తాము బాధ్యత వహించబోమని చెబుతోంది. ఇటీవల వరుసగా కొంత మంది నేతల గురించి వాళ్లు మా పార్టీ కాదు.. మా పార్టీతో సంబంధం లేదు అని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఓ పన్నెండు మంది పేర్లతో ఓ జాబితా విడుదల చేసి వారు.. మాత్రమే మీడియా ప్యానలిస్టులని.. టీవీ చానళ్లలో యూట్యూబ్ చానళ్లలో వారు మాట్లాడే మాటలు మాత్రమే వైసీపీ పాలసీ అని.. మిగతావారు మాట్లాడేవంతా వ్యక్తిగతమేనని సంకేతాలు ఇచ్చారు. ఇందులో అసలు షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. కారుమూరి వెంకటరెడ్డి అని టీవీ చానళ్లలో కనిపించడానికే వైసీపీ నేత అవతారం ఎత్తిన నేతకు చోటు దక్కలేదు.
బోరుగడ్డ, కారుమూరు ఇద్దరూ వైసీపీ వాయిస్ కాదు!
బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ కాదని ఆ పార్టీ తెగదెంపులు చేసుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అదే పనిగా వైసీపీ కోసం బ్యాటింగ్ ప్రారంభించారు. ఆయన మాటలు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అర్జంట్ గా ఆయనకు ..వైసీపీతో సంబంధం లేదని ప్రకటింప చేశారు. కానీ బోరుగడ్డ ఎవరి మనిషో అందరికీ తెలుసు. కానీ వైసీపీనే అలా ప్రకటించేసరికి..బోరుగడ్డ ఎందుకోసం ఇన్ని కష్టాలు పడ్డారని జాలి చూపిస్తున్నారు. అదే సమయంలో కారుమూరు వెంకటరెడ్డి కూడా అంతే. ఆయన టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లలో నోరేసుకుని పడిపోతూ ఉంటారు. ఓ సారి చేసిన వ్యాఖ్యలకు ఆయన అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయనను వైసీపీ కాదనుకుంది. ఆయనకు టీవీ చానళ్ల కు వైసీపీ తరపున మాట్లాడేందుకు వెళ్లేవారి జాబితాలో చోటు లేదు.
జగన్ కోసం కరిగిపోయేవారు ఫ్యాన్స్..నేతలు కాదు!
జగన్ పై . ..వైసీపీ అభిమానంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు.. కేవలం జగన్ అభిమానులు. వారు సొంత పైత్యంతోనే అలా మాట్లాడుతారు కానీ పార్టీ ఆదేశాలతో కాదు. పోలీసులు పట్టుకుపోయినా పార్టీ పేరు చెప్పకూడదు. అలా చెప్పినా మాకు సంబంధం లేదని వైసీపీ ముందుగానే తెగదెంపులు చేసుకుందన్నమాట. జగన్ రెడ్డి కోసం. .. ఆయనకు మానసిక ఆనందం కల్పించడానికి కుటుంబాలను సైతం రిస్క్ లో పెట్టుకుని సమాజంలో చెడుగా తమపై ముద్రపడినా .. నోరు చేసుకుని కష్టపడిన వారికి వచ్చిన ఈ కష్టాలు చూసి వైసీపీ నేతలు కూడా జాలి పడుతున్నారు. తమ పరిస్థితి అలా జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలనుకుంటున్నారు.
కార్యకర్తలను బలి చేసి ఏం సాధిస్తారు? కనీసం అండగా ఉండలేరా?
పార్టీ నిలబడాలంటే జగన్ రెడ్డి ఒక్కడి వల్ల కాదు. ఆయనను అభిమానించేవారిని కాపాడుకుంటేనే పార్టీ నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. పదేళ్ల పాటు కష్టం చేసిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చాక వదిలేయడంతో గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పటికీ కార్యకర్తల నమ్మకం పెరగడం లేదు. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఉండదని అనుకుంటున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచి మేమున్నామన్న భావన కల్పించి మళ్లీ యాక్టివ్ చేయాల్సిన నాయకత్వం.. బాగా కష్టపడిన వారిని పార్టీకి సంబంధం లేదని చెబుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడుతోంది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోంది. వైసీపీ అధినేత వ్యూహమే అధి కాబట్టి.. సైలెంట్ గా బలి కావడం తప్ప చేయగలిగిందేమీ లేదని…బాధితులు కిక్కురుమనడం లేదు.
