ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈసారి పారిశ్రామికవేత్తలకు కాకుండా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన యువనేతలకు , సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వి
యువ నాయకత్వానికి పెద్దపీట
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి రాజ్యసభ ఎంపికల్లో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ఐటీ వింగ్ బాధ్యతలు చూస్తూ, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై పోరాడిన చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారు. నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఉత్తరాంధ్ర బీసీ నేతగా విజయ్ అభ్యర్థిత్వానికి బలమైన అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువ గళం వినిపించడంలో ఆయన చూపిన చొరవకు ప్రతిఫలంగా ఈ అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు.
నమ్మకస్థులైన నేతలకు గుర్తింపు
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కిలారు రాజేష్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. లోకేష్ వ్యక్తిగత బృందంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే, సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. దళిత సామాజికవర్గం నుండి బలమైన గొంతుకగా, పార్టీ స్టాండ్‌ను టివి చర్చల్లో సమర్థవంతంగా వినిపించే ఆయనకు ఈసారి అవకాశం దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన మహాసేన రాజేష్ పేరు కూడా కొన్ని వర్గాల్లో పరిశీలనకు వస్తోంది.
సామాజిక , రాజకీయ సమీకరణాలు
జూన్ 2026లో ఖాళీ కాబోతున్న నాలుగు స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు సీట్లలో కనీసం రెండు సీట్లు పార్టీ కోసం కష్టపడి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని సామాజిక నేతలకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల అటు సామాజిక బ్యాలెన్స్ నిలబెట్టడంతో పాటు, కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేసినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది. గతంలో మాదిరిగా కేవలం ఆర్థిక బలం ఉన్న పారిశ్రామికవేత్తలకు కాకుండా, పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు ఎత్తగల చదువుకున్న యువతను పంపాలని లోకేష్ , చంద్రబాబు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
