ఆ అంశాల నేప‌థ్యాల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌రా..?

ys-jagan

ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఏదో కుట్ర జ‌రిగిపోతోంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీకి వెళ్తుంటారుగానీ, దీనిపై ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రప‌తికి ఎందుకు ఫిర్యాదు చెయ్య‌లేద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాంలో జ‌రిగిన పాద‌యాత్ర‌లో ఆయ‌న మాట్లాడారు. ఇదే ఆప‌రేష‌న్ గ‌రుడ మీద ఆప‌రేష‌న్ చేయాల‌ని సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్ర‌యించ‌లేద‌న్నారు. ఆయ‌న ఎందుకు కేసులు వెయ్య‌రంటే… దీని మీద విచార‌ణ జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడే దొంగ అని తేలుతుంద‌న్నారు.

ఎన్నిక‌ల‌కు ఆర్నెల్ల ముందు నుంచి ఈడీ, ఆదాయ ప‌న్ను దాడులు చెయ్య‌కుండా సుప్రీం కోర్టుకు పోతార‌ట అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న ఎప్పుడూ సుప్రీం కోర్టుకు పోలేద‌నీ, త‌న పార్టీ వారి మీద ఆదాయ ప‌న్ను శాఖ దాడులు జ‌ర‌గ్గానే చంద్ర‌బాబు ఇలా మాట్లాడుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. ‘నీ దొంగ‌త‌నాలు మీద‌, నీ అవినీతి మీద రేప్పొద్దున విచార‌ణ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశిస్తే… ఆ ఆదేశాలు రాష్ట్రంలో చెల్ల‌వు అంటూ చ‌ట్టం తీసుకొస్తావేమో’ అంటూ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. మోడీ పేరుతో నానా యాగీ చేస్తున్నార‌నీ, సీబీఐ అంటూ అదో గొడ‌వ చేస్తున్నారని జ‌గ‌న్ అన్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించి ఈయ‌న ప‌ట్టించుకోరుగానీ, జాతీయ స‌మ‌స్య‌లు కావాల‌ట అంటూ ఎద్దేవా చేశారు. ఇక‌, సుదీర్ఘంగా సాగిన జ‌గ‌న్ ప్ర‌సంగంలో ఇతర విమ‌ర్శ‌లు ష‌రా మామూలే.

జ‌రుగుతున్న ప‌రిణామాల లోతుల్లోకి వెళ్ల‌కుండా, త‌మ‌కు అనుకూలంగా విమ‌ర్శించుకునేందుకు ఎంతైతే వీలుంటుందో… అంతవ‌ర‌కూ మాత్ర‌మే జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. తాజాగా సీబీఐ అంశాన్ని నానా యాగీ చేస్తున్నార‌న్నారు! ఇంత‌కీ జ‌రిగిందేంటీ… సీబీఐలోనే లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డ నేప‌థ్యంలో, రాజ్యాంగబ‌ద్ధంగా రాష్ట్రాల‌కు ఉన్న విచ‌క్ష‌ణాధికారుల‌ను ఉప‌యోగించుకునే క‌దా జ‌న‌ర‌ల్ క‌న్సెంట్ ని ఏపీ స‌ర్కారు ఉప‌సంహ‌రించుకుంది. కేంద్రంలోని భాజ‌పా చేతిలో ఇలాంటి వ్య‌వ‌స్థ‌లు కీలుబొమ్మ‌లుగా ఎలా మారిపోయాయో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. ఆ టాపిక్ జ‌గ‌న్ ఎందుకు మాట్లాడరు..? ఆ నేప‌థ్యాన్ని ఎందుకు ప్ర‌స్థావించరు..? ఇంకోటి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీలో చంద్ర‌బాబు పోరాటం చేయ‌లేద‌ని అనేశారు. సాఫీగా సాగుతున్న భాజ‌పా పొత్తుని టీడీపీ ఎందుకు వ‌దులుకుంది..? మోడీ లాంటి నాయ‌కుడితో ఎందుకు ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా పోరాటం సాగిస్తున్నారు..? రాష్ట్రాల అధికారాల‌ను భాజ‌పా కాల‌రాస్తోంది కాబ‌ట్టే, జాతీయ స్థాయిలో పోరాడాల్సిన ప‌రిస్థితి ఇవాళ్ల ఏర్ప‌డింది..? ఏపీ ప్ర‌యోజ‌నాల సాధన నేప‌థ్యం నుంచి పుట్టిన పోరాటమే క‌దా ఇదంతా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com