ఎడిటర్స్ కామెంట్ : మూడేళ్లలో అన్నీ మరకలే.. మెరుపుల్లేవ్!

” ఆకు లేని పంట అరవై ఆరు పుట్లు ” అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన సాగింది. ఈ నెల 30వ తేదీకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. ఆయన పార్టీ గెలిచి మూడు రోజుల కిందటికే మూడేళ్లు అయిపోయింది. జనం క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. తిరుగులేని బలం ఇచ్చారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అన్నందుకు ఎగబడి చాన్సిచ్చారు. రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఏం చేస్తావో చేసి చూపించమన్నారు. కానీ మూడేళ్లలో ఏం చేశారు? అయితే అప్పులు చేయడం.. లేకపోతే పన్నులు బాదడం.. ఇంకా కాదంటే ఆస్తుల్ని ఆదానికి రాసివ్వడం. అంతకు మించి విపక్షాలు.. వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపులు. ఇదే పాలన.

సంక్షేమం పేరుతో సర్కార్ సర్కస్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాల కింద ప్రజలకు నగదు బదిలీ చేస్తామని సగటున ఒక్కో కుటుంబానికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ఏడాదికి ప్రయోజనం చేకూరుస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఏకంగా మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారనుకుంటే ఒక్కొక్కరికి రూ. ఇరవై ఎనిమిది వేలు ప్రభుత్వం ఇచ్చినట్లయింది. ఏడాదికి ఒక్కొక్కిరికి రూ. ఏడు వేలు సగటున అందాయని అనుకోవచ్చు. ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే్.. ఏటా ఆ కుటుంబం రూ. 28 వేల నగదు ప్రభుత్వం ద్వారా అందిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. ఏటా రూ. లక్షల్లో లబ్ది చేకూరలేదు.. వేలల్లోనే చేకూరింది. అదీ కూడా అందరికీ కాదు.. వైసీపీకి ఓటు వేసిన వాళ్లకి.. ఓటు వేస్తారని భావిస్తున్న వాళ్లకే. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు. అన్న క్యాంటీన్ల దగ్గర్నుంచివిదేశీ విద్యాపథకం వరకూ అన్నింటినీ రద్దు చేశారు. కాలేజీ ఫీజులు తగ్గించేసి.. భారం దించేసుకున్నారు. కానీ విద్యావ్యవస్థే కుప్పకూలే పరిస్థితి. పథకాలను శాచురేషన్ స్థాయిలో అమలు చేయాలని లక్ష్యమని జగన్ చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ మాట చెప్పడం లేదు. నిజానికి ఏ ఒక్క పథకం కూడా అర్హులకు పూర్తి స్థాయిలో ఉందడం లేదు. ఎందుకంటే అర్హులనే కేటగిరీనే ఎవరూ అర్హులు కాకుండా చేశారు. పథకాల అమలు ఓ ప్రహసనంగా మారిపోయింది. ప్రభుత్వం చెప్పే లెక్కలకు నిజంగా విడుద ల చేసే దానికి అసలు పొంతనే ఉండదు.

ఏపీ ఆర్థిక పునాదుల్ని కుప్ప కూల్చేశారు.. అప్పుల పాలు చేసేశారు !

విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న పరిస్థితిలో వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఏపీ భ విష్యత్ అంధకారమైపోయింది. రూ. పది కోట్ల విలువైన ప్రజావేదికను అందులోనే కూర్చుని కూల్చివేస్తున్నామని.. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా సీఎం ప్రకటించినప్పటి నుండి ఈ మూడేళ్లలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రూ. పది లక్షల కోట్ల విలువైన రాష్ట్ర ప్రజల ఆస్తి అమరావతిని నిర్వీర్యం చేసేశారు. మూడు రాజధానుల పేరుతో భారీ డ్రామా నడిపారు. రివర్స్ టెండర్ల పేరుతో మొత్తం అభివృద్ధిని నిలిపివేశారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు మూడేళ్లలో కొంచెం కూడా నిర్మాణం జరుపుకోలేదంటే.. ఇప్పుడు వాటి ఖర్చు ఎంత పెరిగిపోయి ఉంటుందో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. ఇలా ఏపీకి ఆర్థికంగా అండదండలు ఇచ్చే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యంచేశారు. పెట్టుబడులు రాకుండా చేశారు. చివరికి అప్పుల పాలు చేశారు. దేన్ని పడితే దాన్ని అమ్ముకునే దుస్థితి వచ్చింది. చివరికి విజయవాడ బెరం పార్క్ కూడా తాకట్టు పెట్టేశారంటే.. ఇక పెట్టుకోవడానికి ఏమీ లేవనుకోవాలి. ఏడాదిలో 300 రోజులకుపైగా ఓడీలో ఉండే ప్రభుత్వం.. ఏటా రూ. లక్ష కోట్లకుపైగా అప్పు చేసే ప్రభుత్వం ఇదే. ఎంత వడ్డీ.. ఎంత కమిషన్ అన్న దానితో సంబంధం లేకుండా ఎంత ఇస్తే అంత తెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దివాలా అంచున్న ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని కేంద్రం లెక్కలేసింది. అయితే దొంగ లెక్కలతో ఏపీ తెచ్చుకున్న రుణాలను బయటకు తీస్తే.. దివాలా తీసిందని చెప్పినా ఆశ్చర్యం లేదు.

వ్యవస్థలతో ఆటలు !

జగన్ ఏలుబడిలో కొత్తగా వచ్చినవి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు. పంచాయతీరాజ్‌ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం కూడా వివాదాస్పదమయింది. సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో నుంచి తప్పించి రెవెన్యూ శాఖకు బదలాయించారు. ఆ జీవ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టు కొట్టి వేసింది. ఈ ఒక్కటే కాదు ఎస్‌ఈసీ దగ్గర్నుంచి ప్రతి ఒక్క వ్యవస్థతోనూ ప్రభుత్వం ఓ ఆట ఆడుకుంది. యూనివర్శిటీ వైఎస్ చాన్సలర్లయితే… ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కన్నా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పోలీసుల సంగతి చెప్పాల్సిన పని లేదు. హత్యలు చేసిన అధికార పార్టీఎమ్మెల్సీని కాపాడటానికి కట్టు కథలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్క వ్యవస్థ అయినా సక్రమంగా పని చేస్తుందా అనేది… ఎవరికి వారు విశ్లేషించుకుంటే… ఎస్ అనే సమాధానం దేనికీ లభించదు. వ్యవస్థల్ని మనం కాపాడితే.. మనల్ని వ్యవస్థలు కాపాడతాయంటారు. కానీ.. ఇప్పుడు నిర్వీర్యమైన వ్యవస్థలే.. తర్వాత వారి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అడ్డగోలు నిర్ణయాలు !

అలా అనుకున్నారు… అలా జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ను ఎవరూ పట్టించుకోవడం లేదని కోన సీమ జిల్లాకు ఆలస్యంగా పేరు పెట్టి… విద్వేషాలు రెచ్చగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే .. జీవోలను రహస్యంగా ఉంచడం వల్ల ఎన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండదు. కానీ మీడియా ముందుకు ఆదర్శాలు వల్లే వేస్తారు. మూడు రాజధానుల నిర్ణయమూ అంతే. ఏ మాత్రం ప్రాణికత లేదని బీసీజీ కంపెనీ.. బొత్స కమిటీలతో పని పూర్తి చేశారు. పని పూర్తి చేయడం అంటే… ఏపీని సర్వనాశనం చేయడం అన్నమాట.

ప్రతిపక్షాలపై కక్ష సాధింపుల్లో విజయం !

ఓ అచ్చెన్నాయుడు. ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా , నారాయణ దగ్గర్నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎవర్నీ వదిలి పెట్టలేదు. చివరికి కరోనా నిబంధనల ఉల్లంఘన అంటూ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కూడా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు పోలీసులు వెళ్లారు. ఎవరి పైనా నిర్దిష్టమైన సాక్ష్యాలు ఉండవు. ఎవరి కేసులూ నిలబడవు. ఎవరికీ నోటీసులు ఇవ్వరు. రాత్రికి రాత్రి వచ్చి కిడ్నాప్ చేసినట్లుగా తీసుకెళ్లడమే పని. సొంత ఎంపీనీ వదల్లేదు. ఏదైనా టాపిక్‌ను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడో… మరో ఏదైనా సమస్యను చిన్నది చేయాలనుకున్నప్పుడో… ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టు వ్యూహాలను అనుసరించింది. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ… వారు అక్రమాలు చేశారనేలా… ఆధారాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. కోర్టుల సంగతేమో కానీ.. రాజకీయనేతల్ని అరెస్టులు చేసినప్పుడు… వారిని రాజకీయ కక్షతో కాదు.. నిజంగానే నేరం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నామని ప్రజల్ని నమ్మించగలగాలి. లేకపోతే అది రాజకీయ కక్ష సాధింపుల అరెస్టులు అనుకుంటారు. ఏపీలో అదే జరుగుతోంది. అయితే ఎలాంటి శషబిషలు పెట్టుకోకుండా తమకు అధికారం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెలరేగిపోయారు. పోస్టింగ్‌ల కోసమే.. మరో దాని కోసమే కానీ పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. చివరికి ఓ డీజీపీ ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక్క సారి ప్రభుత్వం మారిదే ఏం జరుగుతుందో.. వీరందరికీ కూడా తెలియదు. రియాక్షన్ అంత తేడాగా ఉంటుంది. ఎందుకంటే… భరించిన వాడు తిరగబడితే పరిస్థితులు ఎలా ఉంటాయో చరిత్రలో చాలా ఘటనలు జరిగాయి.

పేదల్నీ వదిలి పెట్టలేదు.. ఇదేం పాలన !

ఓటీఎస్ పేరుతో పేద ప్రజల్ని పిండేశారు. ఇప్పుడు వారిచ్చిన డాక్యుమెంట్లు ఎందుకూ పనికి రావు. చెత్తపన్ను పేరుతో పిండేస్తున్నారు. ఆస్తి పన్నును వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలిచ్చామని చెప్పి.. ఇళ్లు కట్టుకోవాల్సిందేనని చెబుతూ పేదల్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఎనభై శాతం ఇళ్ల స్థలాలు ఎందుకూ పనికి రావు. అక్కడ రోడ్లు .. నీరు మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలంటే .. ముఫ్పై వేల కోట్లు కావాలి. ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కానీ ప్రజల్ని ఇళ్లు కట్టుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కట్టిస్తామని చెప్పి కట్టించడం లేదు. చివరికి గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లూ ఇవ్వలేదు. మద్యం ధలను షాక్ కొట్టేలా పెంచుతామనిచెప్పి.. పెంచి… పేదల్ని నిలువుదోపిడి చేస్తున్నారు. సొంత బ్రాండ్లు మాత్రమే అమ్ముతూ ఆరోగ్యానికి కూడా గ్యారంటీ లేకుండా చేస్తున్నారు. సొంత ఓటర్లను మద్యం ధరలను పెంచి దోచుకునే సీఎం దేశంలో మనకు మరెక్కడా కనిపించరు.

మూడేళ్లలో ఒక్క మెరుపు కూడా లేని మరకల పాలన

మూడేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మైలు రాయి లేదు. అన్నీ కోర్టు చీవాట్లు.. వైఫల్యాలు.. అప్పులు…అవినీతి తప్ప ఇంకేమీ లేదు. ప్రజలు అధికారం ఇవ్వడం అంటే..ఏపీని తనకు రాసిచ్చేసినట్లుగా ఫీలయ్యే ముఖ్యమంత్రి.. ఆయన అండతో సంపాదించేసుకోవాలనే అనుచరులు… ఉద్యోగులకు జీతాలివ్వకపోయినా ఠంచన్‌గా లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే సలహాదారులు… ఇలా ఏపీ భవిష్యత్ అంధకారంలోకి జారిపోయింది. మరో రెండేళ్లకు ఎక్కడ తేలుతుందో కానీ..అనుభవించాల్సింది మాత్రం ప్రజలే.

ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు.. కనీసం చెడు చేయకుండా ఉంటే చాలు అనేది ఓ నానుడి. రాజకీయ పార్టీలు అలా కూడా చేయడం లేదు. ఇష్టారీతిన చెడు చేస్తూ ఓట్లేసిన వారికి కూడా విరక్తి పుట్టిస్తున్నాయి. ఆ కోవలోకే ఏపీ ప్రభుత్వం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close