ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన జగన్, ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నైతిక విలువలకు భూమి, ఆకాశానికి మధ్య ఉన్నంత గ్యాప్ ఉంటుంది. రాజకీయాల్లో అధికారం అనేది ప్రజలకు సేవ చేసే ఒక సాధనం కావాలి తప్ప, సొంత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునే మార్గం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సంస్థల పట్ల అనుసరించిన తీరుతెన్నులు వారి రాజకీయ విలువలలోని అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒకరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కంపెనీల టర్నోవర్‌ను పెంచుకుంటే ..మరొకరు తన వ్యాపారాన్ని ప్రభుత్వానికి ఆమడ దూరంలో ఉంచి నైతికతను చాటుకుంటున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రభుత్వ ఖజానా – సొంత కంపెనీల ఆదాయం
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో భారతి సిమెంట్, సాక్షి పత్రికల దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పథకాలకు, గృహ నిర్మాణాలకు భారతి సిమెంట్ సరఫరాను దాదాపు తప్పనిసరి చేయడం, తద్వారా వందల కోట్ల ప్రజాధనం సొంత కంపెనీ ఖాతాలోకి చేర్చుకున్నారు. ఇక సాక్షి పత్రిక విషయంలో గ్రామ,వార్డు సచివాలయాల నుండి వాలంటీర్ల వరకు ప్రభుత్వ నిధులతో పత్రికను కొనుగోలు చేయించడం ద్వారా సర్క్యులేషన్‌ను, ప్రకటనల ఆదాయాన్ని కృత్రిమంగా పెంచుకున్నారనేది రికార్డులతో సహా నిరూపితమైంది. ఇది నేరుగా అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. కానీ ఐదు సంవత్సరాల పాటు నిర్లజ్జగా ఈ పని చేశారు.
వ్యాపారానికి, అధికారానికి మధ్య లక్ష్మణ రేఖ
దీనికి పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీకి చెందిన ఒక్క మజ్జిగ ప్యాకెట్‌ను కూడా ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు అవసరమైన టెండర్లలో పాల్గొనేలా చేయకపోవడం ఆయన నైతికతకు నిదర్శనం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో లేదా సేవా కార్యక్రమాల్లో హెరిటేజ్ సంస్థ ఉచితంగా ఉత్పత్తులను పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయే తప్ప, ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార లబ్ధి పొందకూడదనే స్పష్టమైన లక్ష్మణ రేఖ ను ఆయన గీసుకున్నారు.
వ్యవస్థాగత మార్పు – నైతిక విలువలే ముఖ్యం
పాలన అంటే కేవలం పథకాలు అమలు చేయడం మాత్రమే కాదు, వ్యవస్థల పట్ల బాధ్యతగా ఉండటం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత సంస్థలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకోవడం వల్ల ఇతర కంపెనీలకు పోటీ లేకుండా పోవడమే కాకుండా, పారదర్శకత లోపిస్తుంది. చంద్రబాబు అనుసరిస్తున్న తీరు రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతుండగా, జగన్ హయాంలో జరిగిన పరిణామాలు అధికార దుర్వినియోగానికి ఉదాహరణలుగా మిగిలిపోయాయి. అయినా దొంగే దొంగా అని అరవడానికి ఓ పత్రిక ఉంది కాబట్టి బురద చల్లేస్తూ ఉంటారు.
