ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వారసురాలిగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టిన వైఎస్ షర్మిల చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ నామినేషన్ల పర్వంలో ఆమెకు స్థానం దక్కకపోవడం, ఆమె చేసిన ఒక సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు ఢిల్లీ నుండి తాడేపల్లి వరకు పెద్ద చర్చకు దారితీసింది. మాట ఇచ్చిన వారికి.. తీసుకున్న వారికి మధ్య ఉన్న మ్యాటర్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు.. అధిష్టానం తనకు ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుందనే అసంతృప్తిని సూటిగా వెల్లడిస్తున్నాయి. పార్టీ కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను బతికించడం కోసం తన సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సైతం విభేదించి పోరాడుతున్న తనకు.. చివరకు కాంగ్రెస్ పార్టీలోనే సముచిత స్థానం దక్కకపోవడం ఆమెలో అభద్రతా భావాన్ని పెంచుతోంది.
జగన్ వల్లే రాజ్యసభ మిస్ అయిందనే ప్రచారం
ఈ పరిణామాల వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రీన్ ప్లే ఉందనే అనుమానాలు షర్మిలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏపీలో ఘోర పరాజయం తర్వాత ఒంటరైన వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మద్దతు కోసం తెరవెనుక రాయబారాలు నడుపుతున్నట్లు రాజకీయ సర్కిల్స్‌లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే, షర్మిలకు కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల నుండి రాజ్యసభ సీటు ఇవ్వకుండా అడ్డుకోవడంలో జగన్ ఒత్తిడి పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ గనుక జగన్‌తో పొత్తు పెట్టుకుంటే.. తనను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారనే ఆందోళన ఇప్పుడు షర్మిలలో స్పష్టంగా కనిపిస్తోంది.
జగన్‌తో కాంగ్రెస్ చేతులు కలిపితే?
గతంలో వైఎస్సార్సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంత కాలం విడిగా ఉన్నా.. చివరకు కాంగ్రెస్ సిద్ధాంతాల నుండే పుట్టుకొచ్చాయి కాబట్టి, భవిష్యత్తులో అవి కాంగ్రెస్‌లోనే విలీనం కావడం లేదా చేతులు కలపడం ఖాయం అని ఆమె షర్మిల ఇదివరకే విశ్లేషించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాల తో , ఒకవేళ జగన్ గనుక ఇండియా కూటమి వైపు లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తే.. ఏపీలో కాంగ్రెస్ జెండా మోస్తున్న షర్మిల భవిష్యత్తు ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. జగన్‌ను తీవ్రంగా విభేదించి, వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగట్టిన ఆమె.. మళ్లీ అదే జగన్ నీడన కాంగ్రెస్‌లో కొనసాగడం దాదాపు అసాధ్యం.
షర్మిలకు క్లిష్ట పరిస్థితే
ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిమిత స్థానాల దృష్ట్యా మరో రాజ్యసభ సీటు సాధించడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి తరుణంలో నమ్మిన సిద్ధాంతం కోసం సొంత కుటుంబాన్ని వదులుకుని వచ్చిన షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా సముదాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అధిష్టానం జగన్ వైపు మొగ్గు చూపి, షర్మిలను ఒంటరిని చేస్తే.. ఆమె మళ్లీ తన సొంత వైఎస్సార్ తెలంగాణ పార్టీ లాంటి వేదికను ఏపీలో నిర్మించుకుంటుందా, లేదా రాజకీయాలకు తాత్కాలికంగా దూరమవుతుందా అనే కోణంలో పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా, “రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు” అనే సూత్రం షర్మిల రాజకీయ ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.
