ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు ఉధృతంగా ఉంటుంది. కానీ, అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ కష్టాల్లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ వైపు చూస్తున్నారు. సొంత పార్టీ నాయకత్వం నుండి స్పందన కరువైనప్పుడు, సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు విన్నవించుకోవడం.. ఆయన తక్షణమే స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
లోకేష్ చొరవతో కదిలిన వైసీపీ యంత్రాంగం
తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భాస్కర్ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, మూడు రోజుల పాటు వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. విసిగిపోయిన భాస్కర్, నారా లోకేష్‌కు ఎక్స్ వేదికగా తన బాధను చెప్పుకున్నారు. గతంలో లోకేష్‌ను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి అయినప్పటికీ, లోకేష్ మానవత్వంతో స్పందించి తన టీమ్‌ను రంగంలోకి దింపారు. లోకేష్ స్పందన చూసిన తర్వాతే వైసీపీ నేతలు మేల్కొని, తాము సాయం చేస్తామంటూ ముందుకు వచ్చి హడావుడి ప్రారంభించారు.
రాజకీయ లబ్ధి కోసమే కార్యకర్తల వాడకమా?
కార్యకర్తలను కేవలం విమర్శలు చేయడానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి మాత్రమే వైసీపీ వాడుకుంటోంది. ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడితే పట్టించుకోని నాయకత్వం, ప్రత్యర్థి పార్టీ నేత సాయం చేస్తానని ముందుకు రాగానే విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. లోకేష్ సాయం ప్రకటించగానే, అది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే భయంతోనే వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప, కార్యకర్తలపై ప్రేమతో కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాలో అనారోగ్యానికి గురైన వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఆయనకు దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిసినా, జగన్ మోహన్ రెడ్డి లేదా పార్టీ యంత్రాంగం నుండి సరైన స్పందన లేదని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకేష్ ఇలాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి నేరుగా సాయం చేయడం సాంకేతికంగా కష్టమైనప్పటికీ, కనీసం లోకేష్ దృష్టికి వెళ్తేనైనా వైసీపీ నేతలు సాయం చేస్తారేమోనని కార్యకర్తలు ఆశపడుతున్నారు.
అనాధలుగా మారుతున్న సోషల్ మీడియా సైన్యం
ఎన్నికల సమయంలో, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు తమను తాము అనాధలుగా భావిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారు, ఇప్పుడు వ్యక్తిగత సమస్యల్లో ఉన్నప్పుడు పార్టీ అండ దొరకకపోవడం వారిని కుంగదీస్తోంది. తమ పార్టీ నేత కంటే విమర్శలు ఎదుర్కొన్న ప్రత్యర్థి నేతే నయం అనే భావన వారిలో బలపడుతోంది. నారా లోకేష్ చేపట్టిన ఈ తరహా రాజకీయం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మీరు తిట్టినప్పటికీ సాయం చేయడానికి నేను ఉన్నాను అనే సందేశాన్ని లోకేష్ పంపడం ద్వారా వైసీపీ కేడర్‌లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నరాు. అటు వైసీపీ మాత్రం సాయం చేయడంలో ఆలస్యం చేస్తూ, లోకేష్ చేసే సాయాన్ని అడ్డుకోవడానికో లేదా విమర్శించడానికో ప్రాధాన్యత ఇస్తోంది.
