కృష్ణా, గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం జనసేనపై కుల రాజకీయాలు చేసేందుకు పక్కా ట్రాప్ వేసింది. జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. ప్రతి వివాదాన్ని కులానికి జోడిస్తోంది. ఇలాంటి పరిణామాలతో జనసేన పార్టీపై ఇతర కులాల్లో వ్యతిరేకత తెస్తున్నారని అనుకుంటున్నారు కానీ.. అక్కడ జరుగుతోంది వేరు. గతంలో ఆ పార్టీ చేసిన కుల రాజకీయాల కారణంగానే .. వైసీపీకి అక్కడ డిపాజిట్లు రాకుండా పోయాయి. తమ వ్యూహాలను మార్చుకోకుండా.. ఇప్పుడు అదే పనిగా మళ్లీ అవే రాజకీయాలు చేస్తున్నారు. దాంతో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది.
పవన్ కల్యాణ్‌పై దారుణమైన తిట్లతో వైసీపీ కార్యకర్తల వీడియోలు
రాజకీయాలను అత్యంత ఘోరంగా దిగజార్చిన వైసీపీ నేతలు .. బూతుల్నే తమ రాజకీయాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొంత మంది రెచ్చగొట్టి వీడియోలు పెట్టేలా చేస్తున్నారు. ఫేక్ యూట్యూబ్ చానళ్లతో వారు చేస్తున్న అరాచకాలకు.. జనసైనికులు ఆవేశపడతారు కాబట్టి.. తరవాత తాము చేయాలనుకున్న రాజకీయాన్ని చేయవచ్చని అనుకుంటున్నారు. వారు అనుకున్నట్లుగా ట్రాప్ చేస్తున్నారు. కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. కానీ దాని వల్ల వైసీపీకి లాభం వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి.
కోనసీమ జిల్లాలో చిచ్చు పెట్టి ఏం సాధించారు ?
కోనసీమ జిల్లాలో వైసీపీ తాము అధికారంలో ఉన్పప్పుడే చిచ్చు పెట్టింది. పెద్ద ఎత్తున అల్లర్లు జరగడానికి కారణం అయింది.సొంత మంత్రి ఇంటిని తగులబెట్టారు. అదంతా వారు కావాలని.. రాజకీయం కోసం పెట్టిన చిచ్చు. ఆ చిచ్చు వల్ల తమకు ఓ వర్గం బలమైన మద్దతు వస్తుందని వారనుకున్నారు. చివరికి వైసీపీకి అన్ని వర్గాలు దూరమయ్యాయని ఎన్నికల ఫలితాలతో తేలింది. కుక్కు కాటుకు చెప్పు దెబ్బ తరహాలో వచ్చిన ఎన్నికల ఫలితాలను చూసి కూడా వైసీపీ ఇప్పుడు అదే తరహా రాజకీయాలు చేస్తోంది.
జనసైనికులు ఇప్పుడు అధికారంలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలి !
విపక్షంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో ఉన్నప్పుడే మరింత బాధ్యతగా ఉండాలి. అధికారాన్ని నెత్తికెక్కించుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు అనిపిస్తే.. ప్రజలు వ్యతిరేకమవుతారు. ఇలాంటి పరిస్థితిని రానిస్తే అది తమ పార్టీకే నష్టం జరుగుతుంది. పవన్ కల్యాణ్ శ్రమ అంతా వృధా అవుతుంది. రెచ్చగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. వారిపై దాడులు చేయడం సరైన పరిష్కారం కాదు.. జనసేనాని చెప్పినట్లుగా వారి కుట్రల్లో పడిపోతే.. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. తిట్టేవాళ్లు.. తిట్టించేవాళ్లకు చట్టపరంగానే సమాధానం చెప్పించాలి. పవన్ కూడా అదే సలహా ఇస్తున్నారు. వైసీపీ ట్రాప్ లో పడకపోతే..చాలా ఆ పార్టీ వ్యూహాలు ఆ పార్టీనే దహించి వేస్తాయి.