ఏపీపై కుట్రలు చేయడానికి బయట నుంచి ఎవరో రావాల్సిన అవసరం లేదు. వైసీపీ చాలు. ఏపీకి గతంలో వచ్చిన పరిశ్రమల్ని.. చివరికి ఏపీకి చెందిన గల్లా కుటుంబాన్ని కూడా తరిమేసిన చరిత్ర ఉన్న వారు ఇప్పుడు.. ప్రభుత్వం అతి కష్టం మీద తీసుకు వస్తున్న గేమ్ చేంజర్ ఇండస్ట్రీస్ ను కూడా వెనక్కి పంపేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ పై తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. అది గూగుల్ కాదని.. అదానీ అని దాన్ని తామే తెచ్చామని చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడని వైసీపీ ఇప్పుడు దాన్ని అడ్డుకునేందుకు పిటిషన్లు వేయడం .. ఆ పార్టీకి రాష్ట్రంపై ఉన్న కుట్రపూరిత మనస్థత్వాన్ని బయట పెడుతోంది.
ఆ భూముల విలువ వేల కోట్లు ఉంటుందని గురుమూర్తి చెబుతున్నారు. 25 శాతం రాయితీతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ఏమిటని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గూగుల్ పేరుతో వస్తున్నప్పటికీ, భూమిని మాత్రం గూగుల్ భాగస్వామ్య సంస్థ అయిన అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద కేటాయించడాన్ని గురుమూర్తి తప్పుబట్టారు. గూగుల్ అనుబంధ సంస్థ ‘రైడెన్ ఇన్ఫోటెక్’ అభ్యర్థన మేరకు భూములను అదానీ సంస్థకు బదిలీ చేయడాన్ని ఆయన పిటిషన్ లో తప్పు పట్టారు. అదే సమయంలో భూములను బలవంతంగా లాక్కుంటున్నారని కూడా ఆరోపించేశారు.
ఇక అడ్డగోలుగా సోషల్ మీడియాలో చేసే వాదనలు భారీ స్థాయిలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తరాంధ్ర ఏఐ హబ్‌గా మారుతుందని అందరూ సంతోషిస్తున్న సమయంలో.. శంకుస్థాపన ముంగిట వైసీపీ ఇలాంటి కుట్రలు చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.


