వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన రాజకీయవ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో తమ ప్రభుత్వంలో అసలు పెట్టుబడులు రాకుండా చేసిన వారు ఇప్పుడు .. వచ్చే పెట్టుబడుల్ని ఆపేందుకు కోర్టుల్లో అడ్డగోలు పిటిషన్లు వేస్తున్నారు. దేశంలో ఐటీ స్పేస్ డెవలప్చేయడంలో నెంబర్ వన్ గా ఉన్న సత్వ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్న భూమి విషయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. వైసీపీకి చెందిన వారంతా ఈ పిటిషన్లు వేశారు. వైసీపీ లాయర్లు వాదించబోతున్నారు.
ఒక్క సత్వకు కేటాయించాలనుకున్న భూమిపై మాత్రమే కాదు.. ఇప్పటికే టీసీఎస్ కు ఇచ్చిన భూములపై పిటిషన్లు వేశారు. ఇతర ఐటీ కంపెనీలకు ఇస్తున్న భూములపైనా పిటిషన్లు వేశారు. చివరికి గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల విషయంలోనూ.. ఓ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేసి దొరికిపోయారు. వీరు చేస్తున్న కుట్రలు, ఏపీకి పెట్టుబడులు రాకుండా కోర్టుల ద్వారా.. న్యాయవివాదాలను సృష్టించే ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. అసలు వీరి సమస్య ఏంటి అన్న చర్చ ప్రజల్లో వస్తోంది.
వ్యవస్థను మేనేజ్ చేస్తారని చంద్రబాబును వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే.. రాజకీయకుట్రలకే కాదు.. రాష్ట్రంపై కుట్రలకు ..పెట్టుబడులు రాకుండా చేయడానికి కూడా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రాజకీయ నేతలకు ప్రజలే గట్టి బుద్ది చెప్పాల్సిన ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన మైండ్ సెట్ మార్చుకోవాలని లేకపోతే .. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని రాజకీయవర్గాలంటున్నాయి.