అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి ఆస్తులను వేలం వేసి ఆ డబ్బులను డిపాజిటర్లకు చెల్లించనున్నారు. గతంలో కొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన వాటిని చిన్న మొత్తంగా డిపాజిట్ చేసిన వారికి చెల్లించారు. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి చెల్లించాల్సి ఉంది.
గతంలోనే టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి.. డిపాజిటర్లకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. అయితే వైసీపీ ఆ ఆస్తులన్నింటినీ టీడీపీ కొట్టేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రతి దానిపై కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుకున్నారు. జీ ఎస్సెల్ సంస్థ డిపాజిట్ కట్టినా చివరికి నిందలు వేస్తూండటంతో వెనక్కిపోయింది. వైసీపీ వచ్చిన తర్వాత అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు వేలం ద్వారా రెడీ చేసిన డబ్బుల్ని ఏడాది తర్వాత బటన్ నొక్కి సగం మాత్రమే ఇచ్చారు. చాలా మందికి అన్యాయం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ చేసిన నయవంచన చిన్నది కాదు. తొలి బడ్జెట్ లోనే 1150 కోట్లు కేటాయించి పంపిణీ చేస్తామని చెప్పారు.కానీ ఐదేళ్లలో ఇచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఆస్తులను అమ్మేస్తే దాదాపుగా ఆరు వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అన్నీ అమ్మేసి డిపాజిటర్లకు చెల్లించనున్నారు. అయితే ఇలాంటి ఆస్తుల వ్యవహారంలో వైసీపీ నేతల కుట్రలు మాములుగా ఉండవు. తాము అధికారంలో ఉంటే తక్కువకు కొట్టేయవచ్చని.. లేదా కబ్జా చేయవచ్చని.. అమ్మకపు ప్రక్రియ జరగకుండా ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.
కోర్టుల్లో పిటిషన్లు వేసి.. వేలంలో పాడుకున్న వారిపై నిందలు వేసే వరకూ వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గదు. అగ్రిగోల్డ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తమ కష్టం అక్కడ ఇరుక్కుపోయిందని ఇప్పటీకీ ఎంతో మంది మథనపడుతున్నారు. వారందరికీ ప్రభుత్వం ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి న్యాయం చేయాల్సి ఉంది. ముఖ్యంగా వైసీసీ చేసే అడ్డంకులను తిప్పికొట్టాల్సి ఉంది.