రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడలో ముస్లింలకు వైసీపీ ఇవ్వాల్సిన ఇఫ్తార్ విందు అర్థాంతరంగా వాయిదా పడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలియడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జగన్ బెంగళూరు ప్యాలెస్ వేదికగా తనపై ఉన్న కేసులు , భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్లే విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.
పవిత్రమైన ఇఫ్తార్ విందును చివరి నిమిషంలో వాయిదా వేయడంపై ముస్లిం మైనారిటీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అధినేత రావడం లేదనే కారణంతో విందును ఆపేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపును సూచిస్తోందని పార్టీలోని కొందరు నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మతపరమైన మనోభావాలతో ముడిపడి ఉన్న ఇఫ్తార్ వంటి కార్యక్రమాల కంటే బెంగళూరులో జరిపే వ్యక్తిగత రహస్య భేటీలే ముఖ్యమా అని మైనారిటీ కేడర్ ప్రశ్నిస్తోంది.
జగన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల మైనారిటీ ఓటు బ్యాంకుకు దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగళూరు సమావేశాల గోప్యత , ఈ ఇఫ్తార్ వాయిదా పరిణామాలు వైసీపీలో కొత్త చర్చకు దారితీశాయి.
