వైఎస్ఆర్సీపీలో ఎప్పుడూ కనిపించని ఒక వింత పరిస్థితి ఇప్పుడు నెలకొంది. పార్టీ కోసం టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో గట్టిగా వాదించే జంట కవులు పాషా , కేఎస్ ప్రసాద్ అనే ఇద్దరు ఇప్పుడు సొంత పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. వీరు స్వయంగా ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, పార్టీ అధిష్టానంలోని ముఖ్య నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. తాము ఇకపై సాక్షి టీవీ ఛానల్‌కు వెళ్లేది లేదని, అక్కడ తమను గౌరవించడం లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి వల్లే పార్టీ ఈ దుస్థితికి వచ్చిందని వారు ఆరోపిస్తుండటం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సజ్జల పై కోవర్ట్ ముద్ర
ఈ జంట కవుల విమర్శలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. సజ్జల ఒక కోవర్ట్ అని, ఆయన ఉద్దేశపూర్వకంగానే జగన్ మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు శాపనార్థాలు పెడుతున్నారు. జగన్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడే కావచ్చు, కానీ ఆయన చుట్టూ ఉన్న కోవర్టులు పార్టీని నాశనం చేస్తున్నారు అనేది వారి ప్రధాన వాదన. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే వారికంటే, కేవలం భజన చేసే వారికే సజ్జల ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మాలాంటి వాళ్లను వదిలించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతృప్తి పరచలేని సజ్జల వ్యూహం!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. పార్టీ వాయిస్‌ను వినిపించే వారిని సంతృప్తి పరచడంలో సజ్జల విఫలమయ్యారనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. విశ్లేషకుల గొంతెమ్మ కోరికల వల్ల సజ్జల విసుగు చెందారా.. లేక వారి అతి పార్టీకి భారంగా మారిందని భావించి కావాలనే దూరం పెట్టారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ, ఒకప్పటి మిత్రులే ఇప్పుడు శత్రువులుగా మారి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తుండటం వైసీపీ కేడర్‌లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.
వ్యతిరేకంగా మార్చుకుంటే ఎలా?
సాక్షికి ఇక పోయేది లేదు అని ఈ జంట కవులు తెగేసి చెప్పడం వెనుక లోతైన కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. తమను ఓ పెయిడ్ ఆర్టిస్టులుగా చూస్తున్నారు తప్ప.. గౌరవం ఇవ్వడంలేదనుకుంటున్నారు. అయితే తమ వాయిస్ గట్టిగా వినిపించే ఇలాంటి వారిని దూరం చేసుకుంటే వైసీపీకి వచ్చేదేం ఉండదు. సజ్జలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు. నిజంగానే సజ్జల అతి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందా అనే కోణంలో జగన్ ఆలోచించకపోతే, వచ్చే రోజుల్లో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది. తన మిత్రులే తనపై విమర్శలు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే, లోపం ఎక్కడుందో వైసీపీ అధినేత తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
