విజయ్ ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని నడపబోతున్నారు. మెజార్టీ కోసం నాలుగైదు చిన్న పార్టీల మద్దతు తీసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఆరు నెలల్లో అసలు సర్కస్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు మరో 11 స్థానాల దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ తరుణంలో ఇతర చిన్న పార్టీల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం నడపడం ఒక ఎత్తైతే, ఏ పార్టీ అండ లేకుండా తన సిద్ధాంతాలకు కట్టుబడి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం మరొక ఎత్తు.
చిన్నాచితకా పార్టీలతో చికాకులు తప్పవు !
విజయ్ ఇప్పుడు కాంగ్రెస్ లేదా ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ప్రారంభంలో అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, భవిష్యత్తులో ప్రతి విధాన నిర్ణయానికి ఆ పార్టీల కళ్లెం విజయ్ చేతుల్లోనే ఉంటుంది. వారు కోరిన పోర్ట్‌ఫోలియోలు ఇవ్వడం నుంచి, వారి అజెండాను అమలు చేయడం వరకు ప్రతి అడుగులోనూ విజయ్ రాజీ పడాల్సి ఉంటుంది. ఇలాంటి అతుకుల బొంత ప్రభుత్వంతో ప్రజలు కోరుకున్న విప్లవాత్మక మార్పులను తీసుకురావడం అసాధ్యం.
పాలన చేయలేని నిస్సహాయత కన్నా..
ఒకవేళ మద్దతు ఇస్తున్న పార్టీలు ఏదైనా విషయంలో అడ్డుతగిలితే, విజయ్ ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. ఇది ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కేవలం అధికారం కోసమే విజయ్ కూడా ఇతర రాజకీయ నేతల్లాగా రాజీపడ్డారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ప్రజలు నాకు పూర్తి స్థాయి అధికారం ఇవ్వలేదు, అందుకే నేను రాజీ పడి పాలన చేయలేను అని ధైర్యంగా చెప్పి, మద్దతు తీసుకోవడానికి నిరాకరించడమే విజయ్‌కు రాజకీయంగా దీర్ఘకాలిక మేలు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ ఎన్నికలే విజయ్‌కు బ్రహ్మాస్త్రం
సరైన మెజారిటీ రాలేదనే కారణంతో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని విజయ్ నిర్ణయించుకుంటే అది రాజకీయంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. నేను నీతివంతమైన పాలన చేయాలనుకుంటున్నాను, అది అతుకుల ప్రభుత్వంతో సాధ్యం కాదు.. మీరే నాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి అని ఆయన ప్రజలను అడిగితే, తమిళ ప్రజలు ఆయన నిజాయితీకి పట్టం కట్టే అవకాశం ఉంది. అలా గెలిస్తే, ఎవరిపై ఆధారపడకుండా తాను అనుకున్న లక్ష్యాలను చికాకులు లేకుండా నెరవేర్చుకోవచ్చు.
నాయకత్వ లక్షణాలకు అది ఒక పరీక్ష
తమిళనాడులో గతంలో డీఎంకే మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర ఉన్నప్పటికీ, విజయ్ వంటి కొత్త తరం నాయకుడికి అలాంటి ప్రయోగాలు ప్రాణాంతకమే. ఎందుకంటే ఆయన ఒక మార్పు కోసం వచ్చారు. ఆ మార్పు రాజీలతో కూడి ఉంటే, అది పాత రాజకీయాలకే మరో రూపం అవుతుంది. తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోటీ చేసిన వారితో చేయి కలపడం కంటే, ఒంటరిగానే పోరాడి మళ్లీ గెలవడం ద్వారా విజయ్ తన నాయకత్వ పటిమను నిరూపించుకోవచ్చు.
అధికారాన్ని అందుకోకుండా రెండో సారి ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆయనకు తిరుగులేని మెజారిటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.
