ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో మతపరమైన పోలరైజేషన్‌కు కొత్త అర్థాన్ని ఇచ్చాయి. మైనారిటీల గొంతుకగా తనను తాను అభివర్ణించుకునే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తాజాగా సెక్యులర్ పార్టీలకు ఓట్లేయడం వృథా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. తన సొంత పార్టీ బెంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, అదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్ , టీఎంసీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపడం ఓవైసీని ఆత్మరక్షణలో పడేశాయి.
తృణమూల్ ఎమ్మెల్యేలలో 32 మంది ముస్లింలు
ముస్లిం ఓట్లు ఇలా సెక్యులర్ పక్షాల వైపు ఏకపక్షంగా మళ్లడం పరోక్షంగా హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు దారితీసి బీజేపీకి బలాన్ని ఇస్తోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈసారి కేవలం 81 సీట్లకే పరిమితమైనప్పటికీ, గెలిచిన వారిలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. తాజా గణాంకాల ప్రకారం, కొత్తగా ఏర్పడిన బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 38 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 32 మంది టీఎంసీ నుండే గెలుపొందారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో కూడా ఓటర్లు ఓవైసీని , ఐఎస్ఎఫ్ ను కాదని, మమతా బెనర్జీ వైపు నిలిచారు. అయితే, ముస్లిం ఓట్లన్నీ టీఎంసీ వైపు మళ్లడం చూసిన హిందూ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో బీజేపీ వైపు భారీగా మొగ్గు చూపారు, ఫలితంగా బీజేపీ 207 స్థానాలతో రికార్డ్ విజయం సాధించింది.
అస్సాంలో ముస్లిం పార్టీగా కాంగ్రెస్
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలు గెలుచుకోగా, అందులో ఏకంగా 18 మంది ముస్లిం ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన హిందూ అభ్యర్థుల సంఖ్య కేవలం ఒకటి మాత్రమే. అస్సాంలో కాంగ్రెస్ పూర్తిగా ముస్లిం పార్టీగా మారిపోతోందనే బీజేపీ ఆరోపణలకు ఈ గణాంకాలు బలాన్ని ఇస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ వంటి పార్టీల కంటే కాంగ్రెస్‌నే ముస్లింలు నమ్మడంతో ఓవైసీ వంటి నాయకులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఓవైసీ ఇప్పుడు సెక్యులర్ పార్టీల వల్ల ముస్లింలకు ఒరిగేదేమీ లేదని, స్వతంత్ర నాయకత్వం కావాలని నినదిస్తున్నారు.
బీజేపీకి ఉపయోగపడుతున్న కాంగ్రెస్ వ్యూహాలు
ఓవైసీ ఆరోపిస్తున్నట్లుగా సెక్యులర్ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయనే వాదనలో కొంత నిజం ఉండవచ్చు. అయితే, ముస్లింలు ఇలా ఒకే పార్టీకి గుంపగుత్తగా ఓటు వేయడం వల్ల ఎదురుగా ఉన్న హిందూ ఓటర్లలో ఒక రకమైన ఆందోళన కలిగి, వారు కూడా బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నారు. అస్సాంలో హిమంత బిస్వా శర్మ అమలు చేసిన మతపరమైన సరిహద్దుల రాజకీయం దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ పోలరైజేషన్ రాజకీయాలు ఒకవైపు కాంగ్రెస్‌ను హిందూ ఓటర్లకు దూరం చేస్తుంటే, మరోవైపు బీజేపీని అప్రతిహతంగా గెలిపిస్తున్నాయి. ఈ విషవలయం నుండి విపక్షాలు ఎలా బయటపడతాయో చూడాలి.
