తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతపరమైన సమీకరణాలను వేగంగా మారుస్తోంది. వైసీపీ తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకే రివర్స్ అవుతున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆత్మరక్షణలో పడింది. ఈ ఆరోపణల నుండి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు ఎదురుదాడిని ఎంచుకున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిరాధారమైన విమర్శలు చేస్తూ, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
రివర్స్ ఎటాక్ చేసేందుకు దేవుడితో ఆటలు
టీడీపీపై కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎదురుదాడి చేసేందుకు శాసనమండలిలోకి ఏకంగా దేవుడి పటాలను తీసుకురావడం ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. సభ లోపలికి దైవ చిత్రాలను తెచ్చి రాజకీయం చేయడం ద్వారా వైసీపీ మరో పెద్ద తప్పిదానికి పాల్పడిందని హిందూ సంఘాలు , కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు కూటమి పార్టీలు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి మతం వద్దనుకున్నా ఈ వివాదంలోకి వస్తుంది. లడ్డూ విషయంలో జరిగిన అపచారం, అన్యమతస్తుడైన ఆయనకు హిందూ ఆచారాలపై నమ్మకం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు , సంప్రోక్షణలు నిర్వహించడం ద్వారా భక్తుల సానుభూతిని పొందాలని కూటమి నిర్ణయించింది.
వైసీపీకి అర్థంకాని రాజకీయ నష్టం
దేవుడికి సంబంధించిన విషయంలో ఏ చిన్న వివాదం తలెత్తినా, అది చివరకు అన్యమతస్తుడైన జగన్‌కే రాజకీయంగా మైనస్ అవుతుందనే విషయాన్ని వైసీపీ గుర్తించలేకపోతోంది. కల్తీ నెయ్యి వివాదంలో తాము క్లీన్ అని నిరూపించుకోవాల్సింది పోయి, చంద్రబాబును బ్లేమ్ చేయాలనుకోవడం ఆ పార్టీని మరింత చిక్కుల్లోకి నెడుతోంది. గతంలో ఆలయాలపై దాడుల సమయంలోనూ ఇలాంటి మతపరమైన విమర్శలు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు లడ్డూ వ్యవహారం కూడా అదే దిశగా పయనిస్తుండటం వైసీపీకి ప్రమాద సంకేతంగా మారింది.
హిందూ ఓటు బ్యాంకు కోసం ఎత్తుగడలు
ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే, ఏపీ రాజకీయాలు పూర్తిగా మతపరమైన విభజన దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీని హిందూ వ్యతిరేక తీరును ప్రజల ముందు పెట్టడం ద్వారా ఆ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. జగన్ హయాంలో హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లిందని గ్రామగ్రామాన ప్రచారం చేయడానికి కార్యాచరణ సిద్ధమైంది. ఈ వివాదంలో వైసీపీ ఎంతగా కూరుకుపోతే, కూటమికి అంతగా రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని వైసీపీనే తెచ్చుకుంది.
