పవన్, జగన్ ఇద్దరూ ప్రత్యేక హోదా కోసం, రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న (ఆదివారం) రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడివచ్చేరు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న భూసేకరణకు వ్యతిరేకంగా మంగళగిరి మండలంలో నిరాహారదీక్ష చేయబోతున్నారు. మళ్ళీ 29న ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు. ఆశ్చర్యకరమయిన వార్త ఏమిటంటే వైకాపా ఎమ్మెల్యే మరియు సినీ నటి రోజా పవన్ కళ్యాణ్ కి వైకాపా తరపున ఒక సందేశం ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి రాజధాని కోసం భూసేకరణను నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు ఇమ్మని కోరారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకొంటున్నట్లయితే ఈనెల 29న తమ పార్టీ నిర్వహించబోయే రాష్ట్ర బంద్ కి మద్దతు తెలుపమని ఆమె కోరారు.
ఇదివరకు తమ పార్టీ అధ్యక్షుడు జగన్ రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతారని ప్రకటించగానే పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లి హడావుడి చేసారని, జగన్ ఈనెల 26న దీక్ష చేపట్టబోతున్నారని తెలియగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ పెనుమాక వెళ్లి హడావుడి చేసి వచ్చేరని రోజా విమర్శించారు. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ రెండు అంశాలపై తమ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు.
బహుశః తమ పార్టీకి దక్కవలసిన క్రెడిట్ ని ఆయన ఎగరేసుకుపోతున్నారని అసూయతోనో లేక పవన్ కళ్యాణ్ సమావేశాలకి స్వచ్చందంగా జనాలు వస్తున్నట్లు జగన్ దీక్షలకు రావడం లేదనే బాధతో అంటున్నారో తెలియదు కానీ ఆమె చేసిన సూచన మాత్రం ఆలోచించదగ్గదే! ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినప్పుడు కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుంది.