ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న ఫోటో పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో సభలు జరిగినప్పుడు అక్కడ కనిపించే ఫ్లెక్సీలలో జగన్ ఫోటోల తో పాటు సినిమా హీరోల ఫోటోలను కూడా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల ఫోటోలను తమ పార్టీ ప్రచారానికి వాడుకోవడాన్ని చూస్తుంటే, వైసీపీకి సొంతంగా జనాన్ని ఆకట్టుకునే శక్తి తగ్గిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సదరు హీరోలకు, జగన్‌కు కనీసం వ్యక్తిగత సాన్నిహిత్యం గానీ, రాజకీయ అనుబంధం గానీ లేకపోయినా.. వారి అభిమానులను ఓట్లుగా మార్చుకోవాలనే కుతంత్రం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ హీరోల్లో ఒక్కరైనా జగన్‌కు మద్దతుగా ఉన్నారా?
నిజానికి ఆ హీరోల్లో ఒక్కరైనా ఎప్పుడైనా జగన్ రెడ్డి గురించి పాజిటివ్‌గా మాట్లాడిన సందర్భాలు లేవు. కనీసం వ్యక్తిగతంగా కలిసి మద్దతు తెలిపిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ జగన్ రెడ్డికి తన క్లాస్మేట్ అయిన సుమంత్ వంటి వారిపై ప్రేమ ఉంటే ఆయన ఫోటోలు వాడుకోవచ్చు, అది కొంతవరకు సమర్థనీయమే. కానీ, సంబంధం లేని అగ్ర హీరోల ఇమేజ్ను వాడుకోవడం అంటే జగన్ ఊరేగింపులకు వస్తున్నవారంతా పెయిడ్ బ్యాచ్ అనుకోవచ్చు. జగన్‌కు నిజంగానే జనాదరణ ఉంటే, కేవలం తన ఫోటోతోనే జనాన్ని రప్పించుకోవాలి కానీ, ఇలా ఇతర హీరోల ఫ్యాన్ బేస్‌పై ఆధారపడటం ఆయన రాజకీయ దివాలాకోరుతనానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
హీరోలు ఖండించలేరు.. ఖండిస్తే మరింత రాజకీయం
వైసీపీ కార్యకర్తలు ఇలా హీరోల ఫోటోలను వాడుకోవడం వెనుక ఒక చవకబారు రాజకీయం ఉంది. సదరు హీరోలు తమ ఫోటోలను వాడుకోవద్దని ఖండిస్తే.. వెంటనే వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టవచ్చు లేదా వారిని ఏదో ఒక రాజకీయ పార్టీకి ఆపాదించి విమర్శించవచ్చు. అందుకే ఆ హీరోలు కూడా పిచ్చివాడి చేతిలో రాయి లాంటి ఈ వ్యవహారంపై స్పందించడం కంటే మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నారు. ఈ సైలెన్స్‌ను ఆసరాగా చేసుకుని, వైసీపీ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లుగా ఫ్లెక్సీలు కట్టేస్తూ, ఆ హీరోల అభిమానులందరూ జగన్ వెంటే ఉన్నారనే భ్రమను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి డ్రామాలతో ఏం బాగుపడతారు?
రాజకీయాల్లో నాయకుడికి ఉండే క్రేజ్ అనేది సహజంగా రావాలి కానీ, ఇలా పక్కవారి గ్లామర్‌ను అద్దెకు తెచ్చుకుని ప్రదర్శించుకోవడం వల్ల తాత్కాలికంగా జనం కనిపిస్తారేమో కానీ, ఓట్లు మాత్రం రాలవు. పాతాళానికి పడిపోయిన తన ఇమేజ్ను మళ్ళీ పెంచుకోవడానికి జగన్ రెడ్డి పడుతున్న ఈ పాట్లు చూస్తుంటే జాలి కలుగుతోంది. ఒకప్పుడు సింహం సింగిల్‌గా వస్తుంది అని డైలాగులు కొట్టిన వారు, ఇప్పుడు సభలు సక్సెస్ కావడానికి సినిమా పోస్టర్ల వెనుక దాక్కోవాల్సి రావడం ఏపీ రాజకీయాల్లోనే అత్యంత చీప్ రాజకీయం గా మిగిలిపోనుంది.
