ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అనేవి కేవలం సిద్ధాంతాల పరంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోణంలోనే సాగాలి. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనుసరించే రాజకీయం వేరు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా ఆయన భావిస్తారు. ప్రత్యర్థి పార్టీల నేతలతో కనీసం చిరునవ్వుతో పలకరించుకోవడం, మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగించడం వంటివి ఆయన నిఘంటువులో ఉండవు. ఆయనకు తగ్గట్లుగా ఆయన పార్టీ నేతలు లేకపోతే వారికి పార్టీలో భవిష్యత్ ఉండదు.
నేతల్ని వ్యక్తిగత శత్రువులుగా మారుస్తున్న జగన్
జగన్ ధోరణి వల్ల రాజకీయ నేతలు కేవలం ప్రజాప్రతినిధులుగా కాకుండా, ఒకరికొకరు బద్ధశత్రువుల్లా వ్యవహరించే ప్రమాదకర సంస్కృతి బలపడుతోంది. అధినేత ఎప్పుడూ సీరియస్గా ఉండటం, ఇతర పార్టీల నేతలతో కలవడానికి ఇష్టపడకపోవడంతో, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అదే బాటలో నడవాల్సి వస్తోంది. గతంలో శాసనసభ వేదికగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇతర పార్టీల నేతలతో కలిసి పాల్గొనేందుకు వైసీపీ నేతలు సిద్ధపడలేదు.. ఇప్పుడు ఆటల పోటీలుూ అంతే. అసెంబ్లీకి వెళ్లాలని వారికి ఉంటుంది. అందరితో పాటు ఆటల పోటీల్లోనూ పాల్గొనాలని ఉంటుంది. కానీ వారేం చేయలేరు.
ఉల్లాసంగా ఉండటం కూడా తప్పేనా
తమ నేతకు నచ్చదు అనే భయంతో మనసు విప్పి నవ్వుకోలేని, కనీసం తోటి ప్రజాప్రతినిధులతో స్నేహంగా ఉండలేని ఒక బంధీ వాతావరణంలో ఆ పార్టీ నేతలు ఉండిపోతున్నారు. క్రీడలు , పాటలు వంటి కార్యక్రమాలు వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి, ఐక్యతను పెంచడానికి దోహదపడతాయి. అయితే, అటువంటి వేదికల మీద కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. ఆటల పోటీల్లో కూడా వైసీపీ నేతలు ఇతర పార్టీల వారితో కలిసి పాల్గొనకుండా దూరం పాటించడం వెనుక ఉన్నది వారి సొంత నిర్ణయం కంటే, తమ అధినేత నుంచి ఉన్న ఆదేశాలే. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆనందాలను, సరదాలను కూడా రాజకీయ కక్షలకు బలి ఇవ్వడం వల్ల నాయకులు మానసిక ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు.
రాజకీయవ్యవస్థకు మంచిది కాదు !
రాజకీయ నేతలు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకున్నప్పుడు, వారిని అనుసరించే క్షేత్రస్థాయి కార్యకర్తలు అంతకంటే తీవ్రమైన హింసాత్మక ధోరణిని అవలంబించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన చోట, వ్యక్తిగత దూషణలు, ద్వేషమే ప్రధాన అజెండాగా మారడం వల్ల ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయి. కేవలం రాజకీయాల కోసమే జీవితం అన్నట్లుగా కాకుండా, మానవ సంబంధాలను గౌరవించే సంస్కృతిని నేతలు అలవర్చుకోకపోతే, భవిష్యత్ రాజకీయాల్లో స్నేహపూర్వక చర్చలకు తావుండదు. చివరకు మిగిలేది వ్యక్తిగత విద్వేషాలు తప్ప ప్రజలకు జరిగే మేలు ఏమీ ఉండదు.
