వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క పెళ్లికి వెళ్లి గత వారం షెడ్యూల్ పూర్తి చేశారు. కానీ బెంగళూరులో ఉండి నిరంతరం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గురించి తెలుసుకుంటున్నారు. ఏం చేయాలో అవినాష్ రెడ్డికి చెబుతున్నారు. అవినాష్ రెడ్డి వల్ల కావడం లేదని ఆయన తండ్రిని రంగంలోకి దించారు. ఫోన్లతో పని కావడం లేదని .. పులివెందుల వెళ్లే అవకాశం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయించారు. పూర్తిగా పులివెందుల గురించి మాత్రమే వైసీపీలో చర్చ జరుగుతోంది.
ఒక్క జడ్పీటీసీ స్థానం కోసం పార్టీ యంత్రాంగం మొత్తాన్ని జగన్ రంగంలోకి దింపడం..ఆ పార్టీ అగ్రనేతల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంచుకోటలకే కంచుకోటలా పులివెందుల ఉందని.. అక్కడ వైఎస్ అనే పేరు మాత్రమే ఉనికిలో ఉంటుందని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పులివెందులలోనే తమను కొడుతున్నారని ఈసీ వద్ద డ్రామాలు వేయాల్సి వస్తోంది. పోలింగ్ స్టేషన్లను ఓటర్లకు అనుకూలంగా పెడితే.. రిగ్గింగ్ చాన్స్ పోయిందన్నట్లుగా బాధపడుతున్నారు.
పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. చాలా కాలంగా ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు. పోటీ చేయడానికే అక్కడి వాళ్లు భయపడిపోయేవారు. ఈ సారి పరిస్థితి మారింది. తమకు ఓటు వేసే అవకాశం.. అది కూడా స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం వచ్చినందుకు ఓటర్లు సంతృప్తిగా ఉన్నారు. ఇంత కాలం తమను భయానికి గురి చేసి లబ్దిపొందిన వారి కుట్రలు తేల్చాలనుకుంటే మాత్రం .. వైసీపీ అధినేత జగన్ కంచుకోటలు బద్దలైపోతాయి.
ఇప్పుడే జగన్ రెడ్డి పరిస్థితి ఘోరంగా ఉంది. ఆయనే భద్రత కోసం అల్లాడిపోతున్నారు. వైసీపీ మూకలు చెల్లాచెదురైపోయాయి. ఇలాంటి సమయంలోనూ ఓటర్లను భయపెట్టగలిగితే వారిదే విజయం అవుతుదంది. కానీ అలా చేయలేకపోతున్నారన్న ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పులివెందుల జడ్పీటీసీ ఫలితం వచ్చాక వైసీపీలో బ్లాస్ట్ ఉండటం ఖాయం అనుకోవచ్చు.