ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరమయ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది అనే విమర్శలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. పల్నాడు ప్రాంతానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివాదం మొదలుకొని, తాజాగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడు ఎపిసోడ్ వరకు.. వైసీపీ తన నాయకులపై కఠిన చర్యలు తీసుకోకుండా..ప్రోత్సహిస్తోంది.
నేరాలు చేసిన వారికి ఆదరణ
వైసీపీలో తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు , వివాదాల్లో చిక్కుకున్న నాయకులను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయడం లేదా దూరం పెట్టడం వంటి చర్యలు ఉండవు. తాజాగా అరెస్టు అయిన బ్రహ్మనాయుడు వంటి నేతలపై చర్యలు తీసుకోకపోవడం, గతంలో సొంత డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు పార్టీ ఇప్పటికీ అండగా నిలవడం వంటి ఘటనలను ఇందుకు ఉదాహరణ. తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నా, కేవలం రాజకీయ సమీకరణాలు లేదా స్థానిక పట్టు కోసం వారిని వెనకేసుకు రావడం పార్టీ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది.
నేరమే వైసీపీలో అర్హత
ఒక రాజకీయ పార్టీ తన పరిధిలోని వివాదాస్పద నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తున్నప్పుడు, అది క్షేత్రస్థాయి క్యాడర్‌కు అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను పంపుతుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, అక్రమాలకు పాల్పడినా పార్టీ హైకమాండ్ మనల్ని కాపాడుతుందనే ధీమా స్థానిక నాయకులలో పెరుగుతుంది. ఇది క్రమంగా రాజకీయాల్లో రౌడీయిజం , ఫ్యాక్షనిజం, నేరమయ సంస్కృతి ని ఒక అర్హతగా మార్చేసే ప్రమాదం ఉంది. ఒక సాధారణ కార్యకర్త కూడా ప్రజా సేవ కంటే చట్టవ్యతిరేక పనుల ద్వారానే పార్టీలో త్వరగా ఎదగవచ్చనే తప్పుడు ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది.
ప్రజల్లో చైతన్యం – పార్టీలు మారాల్సిందే
ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాజం , ఓటర్ల ఆలోచనా విధానం శరవేగంగా మారుతోంది. గతంలో లాగా నేరచరిత్ర ఉన్న నాయకులను చూసి భయపడి ఓట్లేసే రోజులు పోయాయి. ఏ పార్టీ అయినా సరే.. నేరగాళ్లకు, అక్రమార్కులకు అండగా నిలుస్తోందని ప్రజలు గుర్తిస్తే, ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వెనుకాడటం లేదు. అందువల్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా, మరే ఇతర రాజకీయ పక్షమైనా తమ ఉనికిని కాపాడుకోవాలంటే.. వివాదాస్పద నేతలను వెనకేసుకు వచ్చే పాత పంథాను వీడాలి. ఆరోపణలు రాగానే స్వతంత్ర విచారణకు సహకరిస్తూ, పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజల్లో మళ్లీ విశ్వసనీయతను సంపాదించుకోగలవు.
బ్రహ్మనాయుడు చేసింది చిన్న నేరం కాదు. పక్కాగా దొరికిపోయారు. ఆయనపై వైసీపీ వేటు వేసి.. కనీసం నిబద్ధత నటించాల్సి ఉంది.
