ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాల భర్తీకి అధికార తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. కూటమి పొత్తుల సర్దుబాటులో భాగంగా దక్కిన స్థానాల్లో బాష్యం రామకృష్ణ, సానా సతీష్‌ల పేర్లు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా.. మూడో స్థానం కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా మొదటి నుంచి ఈ రేసులో గట్టిగా వినిపించిన ఐటీ వింగ్ అధినేత చింతకాయల విజయ్ పేరు చివరి నిమిషంలో వెనకబడి, ఆయనకు నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తుండటం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఈ చివరి స్థానం కోసం చింతకాయల విజయ్‌తో పాటు పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేరును అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన బంటుగా, విపక్షంలో ఉన్నప్పుడు వైసీపి సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఒంటరి పోరాటం చేసిన వర్ల రామయ్య సుదీర్ఘ సేవలను ఈసారి ఎలాగైనా గుర్తించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ వర్ల రామయ్యకు ఒక మైనస్ పాయింట్ ఉంది. ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకే కుటుంబానికి రెండు కీలక పదవులు ఇవ్వడంపై పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ నడుస్తోంది.
మరోవైపు, చింతకాయల విజయ్ గత కొన్నేళ్లుగా పార్టీ డిజిటల్ వింగ్, సోషల్ మీడియా విభాగాలను ముందుండి నడిపించడమే కాకుండా, కష్టకాలంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. యువతలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఇక్కడ ప్రధాన సవాలు సామాజిక సమీకరణాల రూపంలో చంద్రబాబు ముందుకు వచ్చింది. వర్ల రామయ్య ఎస్సీ వర్గానికి చెందిన అగ్రనేత కాగా.. చింతకాయల విజయ్ ఉత్తరాంధ్రాకు చెందిన బలమైన బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలా? లేక అండగా నిలిచిన దళిత వర్గానికి పెద్దపీట వేయాలా? అనే డైలమాలో అధినాయకత్వం ఉంది.
ఈ ఇద్దరు కీలక నేతలలో చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విధేయతకు పట్టం కట్టాలనుకుంటే వర్ల రామయ్యకు లక్ చిక్కే అవకాశం ఉంది. అలా కాకుండా భవిష్యత్తు రాజకీయాలు, యువతరం నాయకత్వం, ఉత్తరాంధ్ర బీసీ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే విజయ్ వైపు మొగ్గు చూపవచ్చు. ఏదేమైనా, ఒకరికి అవకాశం దక్కితే మరొకరికి నిరాశ తప్పని పరిస్థితి నెలకొనడంతో, బాబు తీసుకోబోయే తుది నిర్ణయంపైనే అందరి కళ్లూ ఉన్నాయి.


