మీరు పెట్టిన మంటే మిమ్మల్ని దహించి వేస్తుందని .. జగన్ రెడ్డి తనకు అర్థం కాని డైలాగుల్ని ట్వీట్లు చేస్తున్నారు. రేపు ప్రెస్మీట్లలో కూడా చదవవొచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఆయనతో పాటు ఆయనకు ఈ స్క్రిప్టులు రాసిచ్చిన వారికి, వాటిని వింటున్న వైసీపీ క్యాడర్‌కు..సామాన్య ప్రజలకు అందరికీ తెలుసు. ఆ మంట పెట్టింది జగన్ రెడ్డేనని. అధికారం ఉంది కదా అని అందరిపై తప్పుడు కేసులతో మాత్రమే కాదు .. తమ రౌడీమూకలకు బీపీలు వచ్చాయని చెప్పి దాడులకు పంపించారు. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లు.. దేన్నీ వదిలి పెట్టలేదు. ఇప్పుడు అదే మంటలు వారిని దహించి వేస్తూంటే హాహాకారాలు చేస్తున్నారు. అదే మంట మీ దగ్గరకు వస్తుందని బెదిరిస్తున్నారు. కానీ ఆ మంటల నుంచి వచ్చిన ఆగ్రహానికి.. ఇప్పుడు సెగ రూపంలో వైసీపీకి, జగన్‌కు తగులుతోంది.
ఐదేళ్ల పాటు దాడులు చేయని రోజు ఉందా?
జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి భోషడికే అన్నారు. నిజానికి ఆ పదానికి అర్థం లేదు. జఫ్పా అన్న పదానికి ఎలా అర్థం లేదో దానికీ లేదు. ఆ పేరుతో పాటలు కూడా వచ్చాయి. ఊతపదంలా వాడతారు. కానీ ఇక్కడ ఆ పదానికి జగన్ రెడ్డి తనదైన అర్థం చెప్పుకున్నారు. అదీ బహిరంగసభలో చెప్పుకున్నారు. తననే తిట్టుకున్నారని చెప్పుకున్నారు. అందుకే తమ కార్యకర్తలకు బీపీలు వచ్చాయన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయం దగ్గర నుంచి పట్టాభి ఇంటి వరకూ అందరిపై దాడి చేశారు. ఇలాంటి దాడులు జరగని రోజు లేదు.
రాజకీయాల్లో దాడుల సంస్కృతి ప్రారంభించి ఏడిస్తే ఎలా?
అంతకు ముందు ఐదు సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది. ఎప్పుడైనా ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య రాజకీయాలు నడిచాయి. అప్పట్లో జగన్ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చేయాలని కూడా అన్నారు. అప్పుడు కూడా దాడులు జరగలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతో కేసులు మాత్రమే పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక వైసీపీ పెట్టిన మంట .. ఇప్పుడు అధికారం కోల్పోయాక వారిని ధరించి వేస్తోంది. ఇప్పటికీ ఆ పద్దతి వాడుకోలేదు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం .. మాట్లాడటం కొనసాగిస్తున్నారు. తన్నులు తిన్నా పర్వాలేదన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. కానీ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు.
ఇదే కొనసాగిస్తే వైసీపీని దహించి వేస్తుంది!
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడిందో ఎవరూ మర్చిపోరు. అధికారం పోయిన మరుక్షణం బడితెపూజ ఉంటుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు అందర్నీ కంట్రోల్లో పెట్టారు . ఏదైనా చట్టప్రకారమే జరగాలని నిర్దేశించారు. ఆ ప్రకారమే జరుగుతోంది. కానీ అలా చేయడమే చేతకాని తనమన్నట్లుగా తమ బూతుల ఆయుధాల్ని మళ్లీ తీస్తున్నారు. ఇప్పుడు వీళ్లను కంట్రోల్ చేయకపోతే లేపు సజ్జల కూడా వచ్చి అదే భాష ప్రయోగిస్తారు. ఆ మంట జగన్ రెడ్డి పెట్టిందే. ఇప్పుడు పార్టీ నేతల్ని, పార్టీని దహించి వేస్తుంది. ఆ విషయం జగన్‌తో పాటు..ఆ పార్టీ నేతలు కూడా గుర్తుంచుకుంటే… కాస్త నష్టంతో బయటపడే అవకాశం లభిస్తుంది.
