వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శాసనమండలి వైస్ చైర్మన్, ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామాను శాసనమండలి చైర్మన్ కు పంపించారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాజీనామా చేసి బీజేపీలో చేరనుండటం .. అది కూడా వైసీపీ నుంచి కావడం ఆసక్తికరంగా మారింది.
జకియా ఖానం అన్నమయ్య జిల్లాకు చెందిన వారు. రాయచోటి అసెంబ్లీ సీటును ముస్లింలకు ఇస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. తర్వాత తన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డికే అవకాశం కల్పించారు. దాంతో ముస్లింలకు పెద్ద పదవి ఇస్తానని చెప్పారు. ఆ ప్రకారం జకియా ఖానంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పేరుకే పదవులు కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్సీ అసంతృప్తికి గురయ్యారు. కనీసం రాయచోటిలో కూడా తమ మాట వినేవాళ్లు లేరని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారు. ఇప్పుడు రాజీనామా చేశారు.
ఇప్పటికి వైసీపీకి ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. జకియా ఖానం ఆరో ఎమ్మెల్సీ. పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి , మర్రి రాజశేఖర్ ఇది వరకే రాజీనామాలు చేశారు. కానీ ఎవరి రాజీనామాలను ఆమోదించడం లేదు. ఎన్నికలకు ముందు వైసీపీని ధిక్కరించిన వారిపై వరుసగా రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేసిన చైర్మన్ మోషన్ రాజు ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసినా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్సీలు మనసు మార్చుకుంటారని ఆశగా చూస్తున్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే వైసీపీ విధానం నవ్వుల పాలవుతోంది.