మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు 1975 ఆగస్టు 9వ తేదీన చెన్నైలో జన్మించారు. తండ్రి ఘట్టమనేని కృష్ణ అప్పటికే టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. కృష్ణ తెలుగు చలనచిత్రరంగ దిగ్గజాలలో ఒకరు. మహేష్ విద్యాభ్యాసమంతా చెన్నైలోనే జరిగింది.  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రమేష్‌(మహేష్ సోదరుడు)తో తీసిన నీడ చిత్రంతో మహేష్ తొలిసారి వెండితెరపై దర్శనమిచ్చారు. చదువుకుంటూనే అప్పుడప్పుడూ తండ్రితోపాటు సినిమాలలో నటించేవారు. 1983లో కృష్ణ హీరోగా రూపొందిన పోరాటం చిత్రంలో హీరోకు తమ్ముడిపాత్రలో నటించారు. ఆ చిత్రంలో అతని నటనచూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంశలు కురిపించారు. ఆ తర్వాత 1987లో కృష్ణ చిత్రం శంఖారావంలో చెల్లెలు ప్రియదర్శినితోకలిసి నటించారు. తర్వాత బజారు రౌడి, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న- తమ్ముడువంటి చిత్రాలలో నటించారు. ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం చిత్రాలలో మహేష్ నటన అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్‌కు మంచి ఆఫర్‌లు వచ్చినప్పటికీ, చదువు చెడిపోతుందనే ఉద్దేశ్యంతో తండ్రి కృష్ణ వాటన్నింటినీ తోసిపుచ్చారు. బాలనటుడిగా మహేష్ తన ఇన్నింగ్సును అక్కడితో ముగించారు.

ఆ తర్వాత మహేష్ 1999లో హీరోగా తన ఇన్నింగ్సును ప్రారంభించారు. తొలిచిత్రం రాజకుమారుడును ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఆ చిత్రంలో కథానాయికగా నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు పెద్ద విజయం సాధించలేదు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో వచ్చిన మురారి చిత్రం మహేష్‌కు తొలి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన టక్కరిదొంగ, బాబీ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, 2003లో వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 2003లోనే మహేష్ నటించిన నిజం చిత్రంద్వారా అతనికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డ్ లభించింది. 2004లో విడుదలైన నాని, అర్జున్ చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. 2005లో విడుదలైన అతడు మళ్ళీ మహేష్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఈ చిత్రం మహేష్‌కు విదేశాలలో ఉన్న బలమైన మార్కెట్‌ను తెలియజెప్పింది. అతడులో నటనకు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డ్ కూడా మహేష్ గెలుచుకున్నారు. 2006లో మహేష్‌కు మరో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెలువడిన పోకిరి చిత్రం రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.

పోకిరి తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి పరాజయం పాలయ్యాయి. అనంతరం 3 సంవత్సరాల వ్యవధితో వచ్చిన ఖలేజాకూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే 2011లో వచ్చిన దూకుడు చిత్రం మహేష్‌కు మరోసారి విజయాన్ని చవిచూపించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్‌కూడా మంచి వసూళ్ళనే రాబట్టుకుంది. ఇక 2013 జనవరిలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విదేశాలలో కూడా మంచి వసూళ్ళను సాధించింది. ఇక ఆ తర్వాత 2014లో వచ్చిన వన్ – నేనొక్కడినే, ఆగడు చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం 2015 జులైలో విడుదల కానుంది.

మహేష్‌కు ఒక అన్న, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. మహేష్ అన్న రమేష్ కూడా పలు హిట్ సినిమాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేష్ పెద్ద అక్క భర్త గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. మరో అక్క మంజుల అప్పుడప్పుడు చిత్రాలలో నటిస్తూ చిత్ర నిర్మాణంకూడా చేస్తుంటారు. చెల్లి ప్రియదర్శిని భర్త సుధీర్ బాబుకూడా ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు.

మహేష్ వంశీ చిత్రంలో తన పక్కన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారికి గౌతమ్ కృష్ణ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com