ఎన్టీఆర్ పేరు మీద రూ. వంద నాణెన్ని కేంద్రం విడుదల చేస్తోంది. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో ప్రభావవంతమైన మార్పులు తెచ్చిన యుగపురుషునిగా ఆయనకు ఇది అరుదైన గౌరవం. సినీ నటుడిగా ఎవరూ అధిరోహించలేనంత ఉన్నత శిఖరాలను అందుకున్న ఎన్టీఆర్ .. రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక… అందరి వాడు కాస్తా కొందరి వారు అవుతారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కొంత మందికి దూరం అయ్యారు. అయితే అప్పటికీ ఆయన ప్రజలందరి అభిమానాన్ని నటుడిగా పొందారు. రాజకీయ నాయకుడిగా చారిత్రక నిర్ణయాలతో ప్రజల గుండెల్లో నిలిచారు. నిరుపేదలు కూడా బియ్యం అన్నం తినేందుకు తాను సీఎం అవ్వగానే రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇలా ఆకలి తీర్చిన ఎన్టీఆర్ తర్వా పేదంలదర్నీ… ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు తెలంగాణలో బీసీ వర్గాలు పైకి రావడానికి రాజకీయ అధికారాన్ని ఇచ్చారు.
ఎంత గొప్ప వ్యక్తి అయినా… రాజకీయాల్లోకి వచ్చాక కొంత మందికి వ్యతిరేకం అవుతారు. అయితే అది ఆయనను రాజకీయంగా వ్యతిరేకించడమే అవుతుంది. కానీ వ్యక్తిగతంగా… ఆయన విజయాలు, చేసిన మేళ్ల పట్ల ప్రజలందరూ ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు. ఆయనను స్మరించుకుంటూనే ఉంటారు. అందుకే… ఆయనకు భారత రత్న ప్రకటించాలన్న డిమాండ్ కు మద్దతు లభిస్తూనే ఉంటుంది.