`రియల్’ హీరో కాలకేయ !

సినిమాల్లో భయంకరమైన విలన్లుగా ప్రేక్షకుల్ని హడలెత్తించినప్పటికీ, బయట నిజజీవితంలో హీరోలుగా చలామణి అయిన వారి జాబితాలో ఇప్పుడు కొత్తగా `కాలకేయ’ కూడా చేరాడు.

`బాహుబలి’ సినిమాలో సమరోత్సాహంతో తన అపార సేనావాహిని యుద్ధరంగంలో ముందుకు నడిపించిన కాలకేయుడు మృత్యురూపంలో విరుచుకుపడే యముడిలా కనిపిస్తాడు. నల్లటి రంగు, బలిష్టమైన రూపం ఆపైన నల్లటి గిరజాల జుట్టు, చేతిలో కత్తులూ, కటార్లు. మహా భయంకరంగా కనిపించే కాలకేయుడు ఎంట్రీతో ఈ సినిమా కథ కీలక మలుపు తిరుగుతుంది. కాలకేయునిగా ప్రభాకర్ పాత్రలో వొదిగిపోయాడు. చంటిపిల్లలుచూస్తే ఝడుసుకునేలా వేషం కట్టాడు. రాజమౌళి కావాలని ఈ పాత్రను ప్రభాకర్ కు అప్పగించారు. ఇంతకు ముందు రాజమౌళి సారథ్యంలోనే వచ్చిన మర్యాదరామన్న చిత్రంలో హీరోయిన్ కు అన్న పాత్ర వేసి మెప్పించాడు. ఆ సినిమాలో అతను గొడ్డలి పట్టుకున్న తీరు, గొడ్డలితో కసిగా వేటువేసే పద్ధతి, యాక్షన్ సన్నివేశాలను అతను పండించిన వరుస.. ఇవే, ప్రేక్షకులు అతణ్ణి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేలా చేసింది. దీంతో రాజమౌళి ఏరికోరి ప్రభాకర్ కు ఇప్పుడు బాహుబలిలో ఈ ఛాన్స్ ఇచ్చారు. అంతే, కాలకేయునిగా తెరపై ప్రత్యక్షమై తన రూపంతో, విచిత్ర భాషతో చిన్నపిల్లలనేకాదు, పెద్దవాళ్లను సైతం హడలెత్తిస్తున్నాడు ప్రభాకర్.
రీల్ లైఫ్ లో విలన్ గానే ఉన్నా, రియల్ లైఫ్ (నిజజీవితంలో) కాలకేయ (ప్రభాకర్) హీరోనే. ఇతను చాలా మంచివ్యక్తి. మనసున్నవాడు. ఇతనిది పాలమూరు. అనాధాశ్రమంలో సేవచేస్తూ పులకించే మనస్తత్వం అతనిది. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని పసివాణి మనస్తత్వం ఇతనిది.
సినిమాల్లో విలన్ పాత్రలు, గయ్యాళి పాత్రలు వేసేవారు నిజజీవితంలో ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం అరుదైన ఘటనేమీకాదు. మా చిన్నప్పుడు సూర్యాకాంతం సినిమాలో కనిపిస్తే చాలు భయపడిపోయేవాళ్లం. కొత్తకోడలు ఇంటి గడపతొక్కగానే సూర్యాకాంతాన్ని చూపించారంటే ఇక ఆ కోడలి పని అయిపోయినట్టేనని అనుకునేవారు. ఆంధ్రుల గయ్యాళి అత్తగారిగా ఆమెకు ముద్రవేశారు. ఎడం చేతి వాటంతో సావిత్రి, కృష్ణకుమారి, జమున వంటి నాటి మేటి హీరోయిన్లను వీపు వాయిస్తూ, మాటల తూటాలు పేలుస్తుంటే హాల్లో కూర్చున్న అత్తలకే చమటలు పట్టేవి. సినిమా చూసొచ్చాక కోడళ్లు, అత్తలను అదోరకంగా చూస్తూ భయపడేవారట. అంతటి గయ్యాళితనం సినిమాల్లో చూపించే సూర్యాకాంతం బయట చాలా మంచి మనసున్న మనిషి. అన్నదానమంటే ఆమెకు చాలా ఇష్టం. తనే స్వయంగా వండి, షూటింగ్ స్పాట్ లో తన తోటివారికి ప్రేమగా వడ్డించేది ఆ మహాతల్లి. అందరినీ ప్రేమగా పలకరిస్తూ, కష్టసుఖాలు తెలుసుకునేది. అప్పుడప్పుడు తనకు తోచిన సలహాలు ఇస్తుండేది. సెట్ లో సూర్యాకాంతం ఉంటే అందరికీ ఆమే పెద్దమ్మ.
అలాగే, ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన రాజనాల నిజజీవితంలో చాలా మంచి వ్యక్తి. కానీ సినీ ప్రభావంతో రాజనాల ఎక్కడకు వెళ్ళినా ముఖ్యంగా కన్నెపిల్లలు ఎదురుపడకుండా పారిపోయేవారని ఒక సందర్బంగా రాజనాల మాట్లాడుతూ – `ఈ జనం నన్ను చూసి ఇంతగా భయపడుతున్నారంటే, నేను ఆ విలన్ పాత్రలను ఎంతగా పండించానో అర్థమవుతుంది. ఇది సంతోషించాల్సిన విషయమే ‘ అంటూ తనదైన మేనరిజంతో బిగ్గరగా నవ్వేశారు. రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు.
ఇక చక్రవర్తుల నాగభూషణం గురించి కూడా చెప్పుకోవాలి. రచయిత రాసిన డైలాగ్ లకు తనదైన స్టైల్ జోడించి ప్రత్యేకతను చాటుకోవడంలో దిట్ట నాగభూషణం. ఆయన నటించిన అనేక సినిమాల్లో వీరు చెప్పే డైలాగ్ లకు ప్రేక్షకుల ఈలలు, తప్పట్లు పడేవి. ఇది కొంతమంది హీరోలకు నచ్చకపోయినా ఆయనలోని ప్రతిభే అవకాశాలను అందించేవి. డైలాగ్ లు చెప్పడంలో ఎస్వీ రంగారావు తర్వాత నాగభూషణం దిట్ట. సినిమాల్లో నాగభూషణం విలనే అయినా నిజజీవితంలో హీరోనే. సినీకళాకారుల సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి తోటి కళాకారులకు చేతనైనంత ఆదుకునేవారు. అంతేకాదు, రక్తకన్నీరు నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ, దాదాపు 25 సంవత్సరాలపాటు మూడు వందల మంది కళాకారులకు అన్నం పెట్టిన చేయి అది.
అలాగే, ధూళిపాళ సీతారామశాస్త్రి (ధూళిపాళగా ప్రసిద్ధులు) అనేక దుష్టపాత్రలు వేసినా చివరి పదేళ్లు ఆధ్యాత్మిక జీవితం గడిపారు. తనకున్న సంపదను త్యజించి ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా సన్యాసదీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి వీరు శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహరింపబడ్డారు. అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది విలన్ పాత్రలు పోషించిన నటులు నిజజీవితంలో మానవమూర్తులుగా, మహనీయులుగా సేవలందించారు. అందుకే వారంతా ప్రజల గుండెల్లో నిండుగా ఉన్నారు. వీరే రియల్ హీరోలు. కాదనగలమా?

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close