ఆంధ్రజ్యోతి రోజువారీగా వైసీపీని చూసి భయపడుతోంది. ఎందుకంటే ఆ పార్టీ ఫేక్ ప్రచారం కోసం భారీ ఆపరేషన్ చేస్తోందని అందుకని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లకు బాధ్యతలు ఇచ్చారని.. వారంతా హైదరాబాద్ లో ఫోన్లు, కార్లు లేకుండా సీక్రెట్స్ గా సమావేశమై ఎజెండా ఖరారు చేస్తున్నారని కంగారు పడుతోంది. ప్రత్యేకంగా కథనం రాసేసింది. నిజంగా వారు అంత సీక్రెట్ గా సమావేశం అయితే.. అందులో ఏం చర్చించారో కూడా లీక్ అయిందంటే.. వారు ఎంత పని మంతులో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే వారేదో చేయబోతున్నారని ఆంధ్రజ్యోతి కంగారు పడుతోంది.
రాజకీయ పార్టీ అన్నాక ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ప్రభుత్వం తప్పులు చేసినా చేయకపోయినా .. ఆరోపణలు సహజం. కళ్ల ముందు కనిపించే వాటిని కూడా అబద్దాలుగా వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే తమను నమ్మేవారు ఉంటారని వారి నమ్మకం. ఆంధ్రజ్యోతి చెప్పే ఐఏఎస్ ఆఫీసర్ వల్లనే వైసీపీ పార్టీకి ఘోరమైన నష్టం జరిగిందన్న కోపం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇంకా ఆయనను నమ్ముకుని ఫేక్ ప్రచారాల యుద్ధం చేస్తారని క్యాడర్ అనుకోవడం లేదు.
ఈ కథనంలోనే ఆంధ్రజ్యోతి కొంత మంది అధికారుల్ని మచ్చిక చేసుకుని కీలక సమాచారం రాబడుతున్నారని చెప్పుకున్నారు. అంత కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని అధికారవర్గాల నుంచి వైసీపీ సేకరిస్తూంటే.. లోపం ఎవరిది?. ఆంధ్రజ్యోతికి తెలిసిన విషయం ప్రభుత్వ వర్గాలకు తెలియదా?. వైసీపీ ఏమీ చేయకుండా ఉంటుందని అనుకోవడం పొరపాటు. రాజకీయం ఖచ్చితంగా చేస్తుంది. దాన్ని తిప్పి కొట్టాలి కానీ.. ఇలా రోజువారీగా వారేదో చేస్తున్నారని కంగారు పడటం ఆంధ్రజ్యోతికే ప్రత్యేకం. ఇలాంటి కథనాలతో వైసీపీకి ప్రత్యేకమైన ప్రచారాన్ని ఆంధ్రజ్యోతి కల్పిస్తోంది. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే.