చిత్రసీమకు రివ్యూల వల్లే నాశనం అయిపోతోందని వాపోయే నిర్మాతలు, దర్శకులు ఎంతోమంది. థియేటర్లకు జనం రాకపోవడానికీ, వసూళ్లు తగ్గడానికీ, థియేటర్లు గత వైభవం కోల్పోవడానికీ కారణం.. ఇదేనంటూ రివ్యూల్ని కార్నర్ చేస్తుంటారు. నిజానికి రివ్యూల వల్ల సినిమాలు ఆడవు.. ఆగవు. దాని కంటే ఎక్కువ నష్టం పైరసీ వల్ల జరుగుతోందన్నది కాదనలేని నిజం. ఈ విషయం నిర్మాతలకూ తెలుసు. హిట్ 3 రిలీజ్ రోజునే హెచ్ డీ ప్రింట్ పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. ఆ క్వాలిటీ చూస్తే మతి పోతుంది. ఇంట్లో ఖరీదైన టీవీలూ, సౌండ్ సిస్టమ్స్ ఉంటే – థియేటర్లో చూసిన ఫీలింగ్ కి ఏమాత్రం తీసిపోదు. ‘హిట్ 3’ అనే కాదు. అదే రోజు విడుదలైన `రెట్రో` సినిమా పైరసీ వెర్షన్ కూడా సేమ్ క్వాలిటీలో దిగిపోయింది. శని, ఆదివారాలు ‘హిట్ 3’ వసూళ్లు బాగున్నాయి. కానీ ఇంకా బాగుండాల్సింది. ఈ రెండింటి మధ్య తేడా ‘పైరసీ’. కనీసం వసూళ్లలో 10 శాతం ఈ పైరసీ వల్ల నష్టపోవాల్సివస్తోంది నిర్మాతలు. ఇది వరకు కూడా పైరసీ బెడద ఉండేది. కానీ హెడ్ డీ క్వాలిటీ ప్రింట్ రావడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు కొన్ని గంటల్లో బయటకు వచ్చేస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? అనేది పెద్ద డిబేట్. కానీ వచ్చినప్పుడు దాన్ని అరిగట్టే వ్యవస్థ లేకపోవడం ప్రధానమైన లోపం. ఇది కేవలం తెలుగు చిత్రసీమని పట్టిపీడిస్తున్న వ్యవహారం మాత్రమే కాదు. అన్ని చోట్లా వుంది.
చిత్రసీమలో యేడాదికి వేల కోట్ల టర్నొవర్ జరుగుతోంది. పెద్ద పెద్ద సినిమాలు తయారవుతున్నాయి. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే – అది విడుదలైన గంటల్లోనే పైరసీకి గురి కావడం ఆందోళన కలిగించే వ్యవహారం. ముందు.. దీనిపై పరిశ్రమలన్నీ ఏకమై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లు పోరాడితే ముందుగా పైరసీ పై పోరాడాలి. ఆ తరవాత మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాలి. చిత్రసీమ వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తోంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలూ ఏటా వందల కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. వినోదపు పన్ను పేరుతో ప్రతీ టికెట్ పై కొంత మొత్తం ప్రభుత్వానికి వెళ్తోంది. టూరిజం బాగుపడుతోంది. షూటింగ్ పర్మిట్ల పేరుతో ఆదాయం వస్తోంది. ఇలా ఎలా చూసినా చిత్రసీమ వల్ల ప్రభుత్వానికి డబ్బే. కానీ.. చిత్రసీమ గురించి ప్రభుత్వాలు పట్టించుకొంటున్నాయా? అనేది పెద్ద ప్రశ్న.
‘మాకు భూములు ఇవ్వండి.. అవార్డులు ఇవ్వండి.. రాయితీలు ఇవ్వండి’ అని అడిగే బదులు `పైరసీని ఆపండి` అని మూకుమ్మడిగా ప్రభుత్వాల్ని నిలదీస్తే తప్ప పనులు జరగవు. చిత్రసీమని ఏకం చేసే శక్తి ఇప్పుడు కావాలి. ఎవరి సినిమా విడుదలైనప్పుడు వాళ్లు ముందుకొచ్చి గొంతు చించుకోవడం తప్ప.. కలిసికట్టుగా పోరాడేతత్వం ఇంకా అలవాటు చేసుకోలేకపోతున్నారు. ఈ వైఖరి మారాలి. దేశంలోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అంతా ఏకమై.. కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకొని, పైరసీ భూతాన్ని అంతమొందించే చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలి. కానీ ఇదంతా జరిగే వ్యవహారమేనా? పరిశ్రమ అందర్నీ ఏకం చేయాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ గంట మెళ్లో కట్టుకోవాలి. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకొంటారు? ఎవరో ఒకరు తీసుకోకపోతే, ఇప్పుడైనా మేల్కోనకపోతే.. చిత్రసీమ మనుగడ రానున్న రోజుల్లో మరింత దుర్భరమయ్యే ప్రమాదం పొంచి వుంది.