డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన నెల వారీ జీతాన్ని పిఠాపురం పేద పిల్లలకు రాసిచ్చేశారు. ఒక్కొక్కరికీ నెలకు రూ. 5వేల చొప్పున సాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా మిగిలిన వేతనం వారి బాగోగులకే కేటాయిస్తారు. పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని అనుకున్నానని కానీ జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నాను. వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువుల ఖర్చు చేయాలనుకున్నానని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రజా సమస్యల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఖర్చుపెడుతూ వస్తున్నారు. ఇప్పుడు వేతనం కూడా అనాథ పిల్లల కోసం కేటాయిస్తున్నారు. వివిధ కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన వారు.. బంధువుల వద్ద ఉన్నా.. వారి కోసం సాయం చేయనున్నారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి తన జీతాన్ని వినియోగిస్తానని పవన్ తెలిపారు.