తెలంగాణ అంటే బీఆర్ఎస్..బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని చెప్పుకునే భారత రాష్ట్ర సమితి నేతలు జూన్ రెండో తేదీన తమ పండుగగా చేసుకోవడంలో విఫలం అయ్యారు. ఈ సారి గ్రౌండ్ ను కాంగ్రెస్ పార్టీకి వదిలేశారు. తెలంగాణ తెచ్చామని మరోసారి చెప్పుకునే అవకాశాన్ని వదిలేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన స్తబ్దతకు సాక్ష్యంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యారు. కేటీఆర్ అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకల్ని నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక తెలంగాణ భవన్ లో అసలు సందడే లేదు. కేసీఆర్ బయట కనిపించలేదు. కనీసం సందేశం ఇవ్వలేదు. కల్వకుంట్ల కవితది ఇప్పటికే వేరు దారిగా మారింది. హరీష్ రావు ప్రెస్ మీట్ తోనే అయిపోయిందనిపించారు. దీంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు ప్రారంభించారు. తెలంగాణ మీద వారికి ఉన్న ప్రేమ ఏంటో జూన్ రెండో తేదీ తెలిసిపోయిందని అంటున్నారు. అధికారం లేకపోతే తెలంగాణ పుట్టిన రోజుకూ గౌరవం ఇవ్వరని అంటున్నారు.
తెలంగాణ వాదాన్ని .. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుని భారత రాష్ట్ర సమితి అని మార్చుకోవడం ద్వారా వదులుకున్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత అబ్బే పేరే మారింది మాది తెలంగాణ వాదమే అన్నారు. కానీ ప్రజలు పట్టిచుకోలేదు. వారదంతా ఫేక్ తెలంగాణ వాదం అనుకున్నారు. అది నిజమేనని బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. వచ్చేది మేమే అని ఎవరు కనిపించినా చెప్పుకోవడం మినహా .. చేస్తున్నదేమీ లేదు. రియాలిటీని అర్థం చేసుకునే రాజకీయం చేయడం లేదు.