హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ఎదిగారని కొనియాడిన రేవంత్… జాతీయస్థాయిలో వాజ్ పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల తాను ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ మీటింగ్ కు హాజరు అయ్యానని , ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేశానని చెప్పారు. అదే సమయంలో ప్రధాని , ఏపీ సీఎం చంద్రబాబును చూపిస్తూ మీ సన్నిహితుడు ఇక్కడే ఉన్నారని చెప్పారు.
దాంతో ప్రధానికి నేను.. స్కూల్ మీ (బీజేపీ) వద్ద చదువుకున్నాను.. కాలేజి ఆయన (చంద్రబాబు) వద్ద చదువుకున్నాను.. ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాను. బీజేపీలో ఉన్న వారందరితోనూ తనకు పరిచయం ఉందని చెప్పినట్లుగా రేవంత్ వెల్లడించారు.
రేవంత్ మొదట ఏబీవీపీ విద్యార్ధినాయకుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రయాణం కొనసాగించి అనంతరం కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.