‘8 వసంతాలు’ సినిమాకి రెండు అట్రాక్షన్లు. ‘మను’ సినిమా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. అయితే సినిమా రిలీజైన తర్వాత ఈ రెండు అట్రాక్షన్లు కనిపించకుండా పోయాయి.
కుబేరతో పాటుగా రిలీజైన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. పైగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ప్రమోషన్స్‌లో హాట్ హాట్‌గా కామెంట్లు చేశాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేవారిని ఏకీపారేసాడు. ‘అర్హత’ ఏమిటని ప్రశ్నించాడు. ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా చాలా హైతో మాట్లాడాడు.
అయితే సినిమా టాక్ తేడా కొట్టింది. దర్శకుడు చాదస్తంతో సహనానికి పరీక్ష పెట్టాడనే కామెంట్లు వినిపించాయి. సినిమాకి జనాలు లేరు. బుక్ మై షో అంతా గ్రీన్‌గా మారిపోయింది.
అయితే పచ్చడైన సినిమాకి కూడా ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ అని చెప్పుకునే సంప్రదాయం ఒకటి వుంది. ఆ రివాజు ప్రకారం ఈ రోజు సక్సెస్ మీట్ పెట్టారు. అయితే ఈ సక్సెస్ మీట్ మరీ చప్పగా జరిగింది. సినిమాకి కీలకంగా కనిపించిన దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్… ఈ ఇద్దరూ కూడా సక్సెస్ మీట్లో కనిపించలేదు.
నిజానికి దర్శకుడు ఈ ప్రెస్ మీట్‌కి వస్తే.. చాలా ప్రశ్నలు అడగాలని ఎదురుచూసింది మీడియా. రిలీజ్‌కి ముందు తను పాస్ చేసిన స్టేట్మెంట్లపై గట్టిగా అడగాలని చూశారు. మైత్రీ మేకర్స్ వస్తే.. వాళ్లు చేసే పెద్ద బడ్జెట్ సినిమాల అప్డేట్స్ అడగాలని చూశారు. కానీ ఈ ఇద్దరూ కనిపించక సక్సెస్ మీట్ కళ తప్పింది.
మైత్రీకి బోలెడు మంది హీరోలు, దర్శకుల బ్యాకింగ్ వుంది. ఈ ప్రెస్ మీట్ కోసం ఓ గెస్ట్‌ని దించడం పెద్ద విషయం కాదు. కానీ మైత్రీ మేకర్స్ ఈ విషయంలో కూడా చొరవ చూపలేదు. నిజానికి ఈ సక్సెస్ మీట్ మైత్రీకి తెలిసి జరిగిందా లేదా అన్నదీ కూడా అనుమానమే.
ఈ సినిమా విజువల్స్‌కి మంచి పేరు వచ్చింది. అలా వచ్చిన ఉత్సాహం ఏమిటో గానీ… డీవోపీ విశ్వనాథ్.. సినిమా తర్వాతలో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందని, అక్కడ క్వాలిటీ ఇంకా బావుంటుందని చెప్పాడు. అసలే సినిమా చికితిపోయింది. త్వరలో ఓటీటీలో వస్తుందని ప్రెస్ మీట్లో చెప్పారంటే… ఎవరైనా ఇంకెందుకు థియేటర్స్‌కి వస్తారు? అసలు ఈ సక్సెస్ మీట్ నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ కోసం పెట్టుకున్నారా? అనిపించింది.
కొన్ని సినిమాలకి రివ్యూస్ నెగటివ్‌గా వచ్చినప్పటికీ థియేటర్స్‌లో జనం కనిపిస్తారు. అలాంటి సినిమాలకు సక్సెస్ మీట్లు, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ఉపయోగపడతాయి. ఈ సినిమాకి మంచి రివ్యూలు రాలేదు, జనం లేరు. సినిమా పనైపోయింది. ఇలాంటి సినిమాకి కూడా సక్సెస్ మీట్ పెట్టుకోవడం వృథా ప్రయాస.