ప్రజలతో కలిసిపోయి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం రాజకీయ నాయకులకు చాలా ముఖ్యం. సమస్యల పరిష్కారానికి.. ఆయా వర్గాల వారికి ఉండే అనేక సమస్యల పై అవగాహనకు ఇది ఎంతో అవసరం. ఈ విషయంలో… ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకత చూపిస్తున్నారు. ప్రతి నెలా ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి స్వయంగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారితో ఇంటరియాక్ట్ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడు కొన్నింటిని పరిష్కరిస్తున్నారు. ఆయా వర్గాలు ఆర్థికంగా మెరుగు పడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఓ అవగాహనకు ప్రత్యక్షంగా వస్తున్నారు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది.
విభిన్న వర్గాల పేదలతో మమేకమవుతున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు P4 – బంగారు కుటుంబం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ఉద్దేశం నేరుగా ఆర్థిక సాయం చేయడం లేదు. ఓ పూట కడుపు నింపడం కన్నా.. వారికి ఆ ఆహారం సంపాదించుకునేలా శక్తిని ఇవ్వడం ముఖ్యమని చంద్రబాబు నమ్ముతున్నారు. అలా చేస్తే ఎప్పటికీ వారి ఆహారం వారే సమకూర్చుకుంటారు. అందుకే ధనవంతుల్ని ఇందులో భాగస్వామ్యం చేసి.. ఆయా కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఏ కుటుంబానికి ఎలాంటి సాయం అవసరమన్నది ప్రత్యేకంగా అసెస్ మెంట్ జరుగుతోంది.
ఆయా వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన
చంద్రబాబు ప్రతి నెలా ఓ పేద కుటుంబం స్థితిగతుల్ని నేరుగా పరిశీలిస్తున్నారు. అందులో అన్ని వర్గాల వారూ ఉంటున్నారు. ఓ బార్బర్ , మరో చర్మకారుడు ఇలా .. బడుగుల్లో.. కులవృత్తి చేసుకుంటున్న వారిలో పేదల్ని ఎంచుకుని వారితో మాట్లాడి.. వారి ఎదుగుదలకు అడ్డం పడుతున్న అంశాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సిన సాయాల్లో.. అందించాల్సిన సహకారాల్లో మార్పులు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. చంద్రబాబు ఏ మాత్రం అరమరికల్లేకుండా.. తన కాన్వాయ్ లో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుతున్నారు. వారి ఇంటికి వెళ్లి వారితో పాటు కూర్చుని ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా వారి కుటుంబసభ్యుడిలాగా మారి.. బతుకులు మారుతాయని భరోసా ఇస్తున్నారు.
చంద్రబాబు వినూత్న ప్రయత్నానికి ప్రశంసలు
చంద్రబాబు ఇలా పేదల ఇంటికి వెళ్లి.. వారి జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాల మార్పు, సాయం గురించి వాకబు చేయడం, దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ ముఖ్యమంత్రి ఇలా నేరుగా పేదల ఇళ్లకు వెళ్తే.. ఎన్నో మార్పులు వస్తాయని.. గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పెన్షన్ల పంపిణీ, ఆ తర్వాత పేదలతో ముఖాముఖి ఓ ట్రెండ్ సెట్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీని వల్ల ఆయా వర్గాలు ఆర్థికంగా బలపడే నిర్ణయాలు తీసుకోగలిగితే… సూపర్ సక్సెస్ అయినట్లే.