వైసీపీని పాతాళంలోకి తొక్కేసిన వ్యక్తిగా క్యాడర్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తారని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఈ వారం జగన్ బెంగళూరు నుంచి రాలేదు. వస్తే అరెస్టు చేస్తారని భయపడుతున్నారేమో కానీ.. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి తమ సానుభూతిపరులైన మీడియా, సోషల్ మీడియాలను పిలిచి ఇంటర్యూలు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లబోతున్నాడని చెబుతున్నారు.
సాక్షితో సహా .. తాను అనధికారిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరించి టీవీ9, ఎన్టీవీ, టెన్ టీవీ తో పాటు వెబ్ మీడియాకు పిలిచి మరీ ఇంటర్యూలు ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందులో ఆయన చెప్పే కోర్ పాయింట్ ఒక్కటే. అదే జగన్ అరెస్టు. జగన్ ను త్వరలో జైలుకు పంపబోతున్నారని ఆయన అంటున్నారు. అయినా సరే గట్టిగా నిలబడతామని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడి చూస్తే.. జగన్ జైలుకెళ్తే పార్టీ ని గుప్పిట్లో పెట్టుకుని తానే చీఫ్ అని ప్రచారం చేసుకోవాలన్న తాపత్రయంలో ఉన్నట్లుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి చాలా జాగ్రత్తగా జగన్ రెడ్డిని ఒంటరిని చేశారు. విజయసాయిరెడ్డిని, వైవీ సుబ్బారెడ్డి లాంటి వారిని కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పూర్తిగా దూరమయ్యారు. సుబ్బారెడ్డి ఉన్నా.. ఆయనకు కొంత వరకే యాక్సెస్ ఉంటుంది. కానీ సజ్జల మాత్రం మొత్తం పార్టీని పట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే మొత్తం ఆయన గుప్పిట్లోకి వస్తుంది.
ఇప్పటికే జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై .. వ్యతిరేక ప్రచారం చేయించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. భారతిరెడ్డి ప్రజల్లోకి వస్తే.. కుటుంబంలో చిచ్చుకు ఆమె కారణం అనుకుంటారని.. ఆమె రాకపోతేనే బెటర్ అని సజ్జల సలహాలు ఇస్తారు. ఆమెను బయటకు రావడానికి ఆలస్యం చేస్తారు. ఈ లోపు సజ్జల పార్టీపై పట్టు సాధిస్తారు. జగన్ జైలుకెళ్లడం ఖాయం కాబట్టి.. పన్నీర్ సెల్వంలా పదవులు పొందవచ్చని సజ్జల ఆశపడుతున్నారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.