పులివెందులలో పోటీ నుంచి పారిపోలేకపోయారు. ఇప్పుడు ఓడిపోతారని తెలిసి .. దానికి కారణాలుగా తమ ఓటర్లతో ఓటు వేయనివ్వలేదని చెప్పుకోవడానికి విచిత్రమైన ఎత్తులు వేస్తున్నారు. తమను ఓటు వేయనివ్వాలని కొంత మంది పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నట్లుగా ఓ వీడియో వదిలారు. వాళ్ల దగ్గర కనీసం పోల్ స్లిప్పులు కూడా లేవు. అదే గుంపులోని ఓ వ్యక్తి.. మరో చోట.. తమను ఓటు వేయడానికి మధ్యాహ్నం రమ్మన్నారని చెుతున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలను చూస్తే.. వైసీపీ ఓటర్లను ఓట్లు వేయలనివ్వడం లేదని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఉంది.
మరోవైపు అన్ని పార్టీలకు చెందిన ప్రధాన నేతల్ని ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీలో ఓటు హక్కు లేని నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. అవినాష్ రెడ్డిని కూడా అలాగే చేశారు. అయితే ఒక్క అవినాష్ రెడ్డి మాత్రమే డ్రామా క్రియేట్ చేశారు. మిగతా అందరూ పోలీసుల నిబంధనలు పాటించారు. టీడీపీ నేతల్ని కూడా హౌస్ అరెస్టులు చేశారు. అయినా హడావుడి అంతా ఏదో వైసీపీ నేతల్ని చేసినట్లుగా నే ఉంది.
పులివెందులలో ఇంత కాలం జరిగిన రాజకీయానికి ఇప్పుడు జరుగుతున్నదానికి పొంతన లేదు. అక్కడ ప్రజలు తమ వెంటే ఉన్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. అలాంటప్పుడు ఎందుకు పోలింగ్ జరుగుతూంటే భయపడుతున్నారన్నది అర్థం కాని విషయం. జగన్ రెడ్డి బెంగళూరులో కూర్చుని మరీ ఒక్క జడ్పీటీసీ పోలింగ్ పై వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ఓటర్లను ఎలా నియంత్రించాలో .. ఎలా బెదిరించాలో ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఈ వ్యూహాలన్నింటినీ కనిపెట్టి .. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.