హైదరాబాద్‌కు బీచ్‌ను తీసుకువస్తామని రాజకీయ నేతలు హామీలు ఇస్తూంటారని.. సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సెటైర్లను ఆపేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే.. హైదరాబాద్‌కు నిజంగానే బీచ్ ను తీసుకు వస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలోని కొత్వాల్ గూడ వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి కృత్రిమ బీచ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడనున్న ఈ రూ. 225 కోట్ల ప్రాజెక్ట్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌ను ప్రపంచ టూరిజం మ్యాప్‌లో నిలిపే లక్ష్యంతో, సాహస క్రీడలు, ఫ్లోటింగ్ విల్లాస్, వేవ్ పూల్‌లు, లగ్జరీ వసతులతో నిర్మిస్తున్నారు. కొత్వాల్ గూడలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఇందు కోసం స్థలం రెడీచేశారు.
ఈ ప్రాజెక్ట్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP మోడల్) ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైంది. అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో రూ. 225 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కృత్రిమ బీచ్ కేవలం ఇసుకతో కూడిన సముద్రతీరం మాత్రమే కాదు అన్ని రకాల ఎంటర్టెయిన్ మెంట్ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. స్థానికులకు సమీపంలోనే సముద్రతీర అనుభవాన్ని అందించడంతో పాటు, ఈ బీచ్ అంతర్జాతీయ పర్యాటకుల్ని పెంచుతుందని నమ్మకంతో ఉన్నారు.
