“ లోకేష్ గారూ.. కష్టాల్లో ఉన్నా.. ఆస్పత్రి ఖర్చులైపోయాయి. బిల్లులు ఉన్నాయి. కాస్త సీఎంఆర్ఎఫ్ సాయం చేయండి” అని ఓ వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో లోకేష్ ను అడిగారు. వెంటనే లోకేష్ స్పందించారు. తన టీమ్ సంప్రదిస్తుందని చెప్పారు. ఆ కార్యకర్త ఆస్పత్రి బిల్లులు సమర్పిస్తే అతనికి సీఎంఆర్ఎఫ్ సాయం లభిస్తుంది. అయితే ఇలా అడిగాడని చెప్పి ఆ కార్యకర్త సోషల్ మీడియా అకౌంట్ ను ఆ పార్టీ నేతలు డీయాక్టివేట్ చేయించారు. కానీ ఆ విషయం కూడా వైరల్ కావడంతో మళ్లీ యాక్టివ్ చేయించారు. ఇలా చేయడం వల్ల నారా లోకేష్ చేసిన సాయం గురించి మరింత విస్తృత ప్రచారం లభించింది.
వీడు మన పార్టీ.. వాడు మన పార్టీ కాదు.. అనుకునే మనస్థత్వం ఉన్న వారు ఎవరూ మంచి పాలకులు కాలేరు. కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం అని బిల్డప్ డైలాగులు కొట్టిన పాలనలో.. చూసేవన్నీ అవే. ముఖ్యంగా పార్టీ. వాలంటీర్లను నియమించడం దగ్గర నుంచి పథకాల లబ్దిదారుల ఎంపిక వరకూ ప్రతి విషయంలోనూ పార్టీ చూసేవారు. టీడీపీ సానుభూతిపరులు అన్న అనుమానం కలిగితే వారికి టార్చరే. సాయం అడిగే చాన్స్ కూడా ఇవ్వరు. కానీ నారా లోకేష్ భిన్నం. అందుకే వైసీపీ కార్యకర్త అడిగినా వెంటనే సాయం చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కష్టాల్లో ఉన్న వారి కోసం. గతంలో జగన్ రెడ్డి.. తాను ఆరోగ్యశ్రీకి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని ఇక ఎవరికీ సీఎంఆర్ఎఫ్ అవసరం రాదని ఇవ్వడం మానేశారు. సొంతపార్టీ కార్యకర్తలకూ ఇవ్వలేదు. దాంతో తమ పార్టీ కార్యకర్తలకు సాయం చేయలేక నేతలు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో సీఎంఆర్ఎఫ్ దొంగ చెక్కులతో వందల కోట్లు కాజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎంత కొట్టేశారో బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం చాలా పకడ్బందీగా అవసరమైన వారికి సాయం అందిస్తోంది. అందులో వైసీపీ వాళ్లు కూడా ఉంటున్నారు.
ఇదే మొదటి సారి కాదు..గతంలో మహిళా కమిషన్ సభ్యురాలిగా వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన గడ్డం ఉమ కూడా లోకేష్ ను ఓ పిల్లవాడికి వైద్య సాయం అడిగారు. ఆమె మన పార్టీ కాదు అని లోకేష్ అనుకోలేదు. వెంటనే చేశారు. ఏదో డబ్బులు కొట్టేద్దామన్న ఉద్దేశంతో .. కొంత మంది వైసీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తూంటారు. కానీ లోకేష్ టీం సాయం చేసే ముందు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తారు. మోసం చేయాలనుకుంటే కేసుల పాలవుతారు.


