అమెరికా బయట షూటింగ్‌లు జరుపుకున్న సినిమాలకు వంద శాతం పన్నులు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. నేడో రేపో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే టాలీవుడ్ సినిమాల డ్రీమ్ రన్‌కు తెరపడినట్లు అవుతుంది. ఇప్పటి వరకూ పరిమితంగానే ట్యాక్స్ ఉంది. ఇప్పుడు వంద శాతం పన్ను విధిస్తే.. సగం కలెక్షన్లు ట్యాక్స్ కే చెల్లించాల్సి ఉంటుంది.
ఓ సినిమాను మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తే అంతే మొత్తం పన్ను కట్టి రిలీజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క టాలీవుడ్ సినిమాలకే కాదు.. మొత్తం భారతీయ సినిమాలు, ఇతర దేశాల సినిమాలకూ ఇదే వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే అమెరికన్ నిర్మాణ సంస్థలకూ కష్టమే. గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అమెరికన్ సినిమాలను చాలా వరకూ ఇతర దేశాల్లో షూట్ చేస్తున్నారు. కానీ హాలీవుడ్ సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిబంధనల కారణంగా అమెరికాలోనే షూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇప్పటి వరకూ అమెరికా.. టాలీవుడ్ సినిమాలకు ఓ పెద్ద మార్కెట్ గా మారింది. కొన్ని కొన్ని సినిమాలు ఓవర్సీస్ కలెక్షన్లతోనే బయటపడుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఆ మార్కెట్ కు కోత పడుతుంది. ఈ టారిఫ్‌లపై అమెరికా న్యాయనిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్‌లు వస్తువులపై మాత్రమే వర్తిస్తాయి, సర్వీసెస్‌పై కాదని ట్రంప్ నిర్ణయం కోర్టుల్లో నిలబడదని కొంత మంది అంటున్నారు.