అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయడానికి ఇప్పటి వరకూ ఉన్న ఆటంకాలు పూర్తయ్యాయి. గతంలో కొంత మంది రైతులు భూసమీకరణకు ముందుకు రాలేదు. మాస్టర్ ప్లాన్ లో ఈ భూములు సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవేకు అనుసంధానం చేయడానికి , కొండవీటివాగు విస్తరణకు అవసరమైనవి. ఈ రోడ్ నిర్మాణం తుళ్లూరు నుంచి ఉండవల్లి వరకు జరిగినా ఈ భూమికి ఇవ్వకపోవడం వల్ల ఆలస్యం అయింది. రైతులకు చట్టప్రకారం పరిహారం ఇచ్చి భూసేకరణ చేయాలనుకున్నారు. కానీ సమీకరణ వల్లనే ఎక్కువ లాభం అని రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు గురువారం రెండు గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర రోడ్ల నిర్మాణం జరిగే ప్రాంతంలో ఇంకా పూలింగుకు ఇవ్వాల్సిన భూమి ఉందని, వాటిని కూడా ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. భూ సమీకరణ అవసరాన్ని, ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ఫలితాలను వారికి తెలిపారు. దీంతో భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. ఉండవల్లిలో 22 మంది రైతులు 12 ఎకరాలను, పెనుమాకలో కొండవీటివాగు, ఇతర రోడ్ల నిర్మాణానికి అవసరమైన 28.25 ఎకరాలను సిఆర్డిఏకు భూ సమీకరణకు ఇస్తూ అగ్రిమెంటు చేసుకున్నారు. దీంతో సీడ్ యాక్సెస్రోడ్డు పనులు పూర్తవుతాయి. కరకట్ట విస్తరణ పనులకూ మార్గం సుగమం అవుతుంది.
గతంలో ఈ గ్రామాల రైతులు భూమి ఇవ్వడానికి అంతగా ముందుకు రాలేదు. ఉండవల్లి రైతులు గ్రీన్ జోన్ ఆంక్షలు తొలగించాలని, అధిక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల వైఖరి మారింది. ఈ సహకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, పవర్ గ్రిడ్ల వంటి మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తుంది.