ప్రకృతిని ఎదుర్కోలేం. ప్రకృతి ఆగ్రహిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఆ ప్రభావాన్ని ముందుగా గుర్తించి వీలైనంతగా జాగ్రత్తలు తీసుకుని ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుదూద్ సమయంలో తీసుకున్న గట్టి చర్యల కారణంగా ప్రాణనష్టాలు జరగలేదు.కానీ ఆస్తి నష్టం తప్పలేదు. ఇప్పుడు .. ఏపీ తీరంలోనే భారీ తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో అలాంటి పరిస్థితే ఏర్పడనుంది. తీవ్రత తక్కువగా ఉన్నా… కోస్తా ప్రాంతం అల్లాడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తుపాన్ ప్రభావం రెండు రోజులు తీవ్రం !
తుపాన్ మొంథా ప్రభావం నాలుగు రోజుల పాటు ఉంటుంది. సోమవారం , మంగళవారం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రజలందర్నీ అప్రమత్తం చేసింది. ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముప్పు లేని చోట.. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే ఎలా వ్యవహరించారో.. జాగ్రత్తలు చెప్పారు. చాలా చోట్ల ముందస్తుగా సహాయ సామాగ్రిని చేర్చారు. క్యాంపుల్లోకి వేల మందికి ఆశ్రయం కల్పించారు.
ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా రెడీ!
ప్రభుత్వం తుపాను ముప్పు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న జిల్లాలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా నిధులు ఇచ్చింది. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడనికి కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా రాష్ట్రానికి చెందిన విపత్తు నిర్వహణ బృందాలతో పాటు.. కేంద్రానికి చెందిన విపత్తు నిర్వహణ బృందాలను కూడా మోహరించింది. ఓ ప్రభుత్వం విపత్తుల పట్ల ఇంత జాగ్రత్తగా వ్యవహరించడం ప్రజల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.
జలాశయాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు
వచ్చే వరదను బట్టి జలాశయాల్లో నీటి నిల్వను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని దిగువకు వదిలేయాలని.. ఈ విషయంలో చిన్న పొరపాటుకు కూడా తావివ్వకూడదని.. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో డ్యామ్ కొట్టుకుపోయేంత వరద వస్తుందని తెలిసినా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. దాని వల్ల ఓ ఊరు శిథిలం అయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇలాంటి పాలనా వైఫల్యాలు మరోసారి జరగకూడదని అధికార యంత్రాంగాని ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది.
