సినిమా పరిశ్రమను చీడలా వేధించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ క్లోజ్ అయింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన పోలీసులు, తనతోనే ఐబొమ్మతో పాటు బప్పం టీవీలను క్లోజ్ చేయించారు. పైరసీ రూపంలో రవి చేసిన అక్రమాలను బయటపెట్టారు. ఈ పరిణామాలపై తెలుగు సినిమా పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది పెద్ద అచీవ్మెంట్’ అని చిరంజీవి పోలీసులను అభినందించారు. నిజమే… పైరసీ నిర్మూలనలో ఇదొక కీలక అడుగు. కాకపోతే ఇక్కడితో అంతా అయిపోయిందా? పైరసీ ఖేల్ ఖతం అనుకోగలమా? అనేది ప్రశ్న.
ఐబొమ్మ ఒక పైరసీ వెబ్సైట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రచారం పొందింది. ఒక అఫీషియల్ వెబ్సైట్లా చలామణి అయింది. సినిమాతో పరిచయం ఉన్న అందరికీ ఐబొమ్మ తెలుసు. తెలుగులో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో, హాట్‌స్టార్ కంటే ఐబొమ్మ పాపులర్. నిజానికి చాలా పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి. కానీ ఐబొమ్మ ఇంటర్ఫేస్, నావిగేషన్… వాడకానికి చాలా సులువుగా ఉంటుంది. ఒక క్లిక్‌లో సినిమా చూడొచ్చు. దీనికి తోడు “ఐబొమ్మ” అనే డొమైన్ పలకడానికి, URL రాయడానికి సులువు. ఈ సైట్ నిర్వాహకుడు రవి స్వతహాగా డెవలపర్ కావడంతో యూజర్‌ఫ్రెండ్లీగా వెబ్‌సైట్‌ను తయారుచేశాడు. ఇవన్నీ ఐబొమ్మను పైరసీ వినియోగదారులకు మరింత చేరువ చేశాయి.
రవి అరెస్ట్‌పై ఇంటర్నెట్లో వచ్చిన పోస్టులు చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది. అక్రమ కార్యక్రమాలు చేసి అరెస్టైన వ్యక్తిపై చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారు. రవిని సొంత భార్యే పట్టించిందని ఓ కథనం. దీనికి శివాజీ సినిమాలో రజనీకాంత్ మీమ్ (ఆ సినిమాలో శివాజీని భార్యే పట్టిస్తుంది) వాడుకొని వైరల్ పోస్టులు పెట్టారు. “మేము అతని సైట్లోనే ఫ్రీగా సినిమాలు చూసేవాళ్లం. ఆయన్ని కొట్టలేం” అంటూ ఇంకో పోస్ట్. ఈ పోస్టుల కింద కామెంట్లు చదివితే ఇంకా షాక్. సినిమా పరిశ్రమపై చాలా అసహనం ఉన్నట్లుగా ఆ కామెంట్లు కనిపిస్తున్నాయి. టికెట్ రేట్లు పెంచి సామాన్యుడికి సినిమాని దూరం చేశారనేది మెజారిటీ విమర్శ ఉంది.
అయితే ఈ విమర్శకు పైరసీ పై పోరాటానికి లాజిక్ లేదు. టికెట్లు పెంచారు సరే. చూడటం, చూడకపోవడం జనాల ఇష్టం. ఎవరూ కూడా ఆడియన్స్‌ను బలవంతంగా థియేటర్లకు తీసుకురావడం లేదు. టికెట్ కొనాలా వద్దా అనేది పూర్తిగా ఆడియన్స్ ఛాయిస్. కానీ పైరసీ అనైతికం. నచ్చిన వస్తువును డబ్బులు పెట్టి కొనుక్కోవడానికీ, దొంగిలించడానికి చాలా తేడా ఉంది. పైరసీ చూడటం, దాన్ని ప్రోత్సాహించడం రెండూ తప్పే. కాకపోతే.. రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన స్పందనను సినీ పరిశ్రమ గమనించాలి. పైరసీ పరిశ్రమకు చాలా కీడు చేస్తుంది. అలాంటి చీడను తొలగిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఏకపక్ష మద్దతు ఎందుకు రాలేదో పరిశీలించుకోవాలి.
ఇకపోతే ఐబొమ్మ క్లోజింగ్ తర్వాత పరిశ్రమ ఎంతవరకు ఊపిరిపీల్చుకోవచ్చన్న అంశాన్ని చెప్పుకోవాలంటే . ఇదొక అడుగు మాత్రమే గాని గమ్యస్థానం ఇంకా చాలా దూరం ఉందనేది వాస్తవం. నిజానికి ఐబొమ్మ చాలా వరకూ OTTలోకి వచ్చిన సినిమాల్ని అప్లోడ్ చేసేది. కానీ దీనికంటే ఎక్కువ నష్టం మూవీ రూల్జ్ లాంటి పైరసీ వెబ్‌సైట్‌తో జరుగుతోంది.
కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్తయ్యిన వెంటనే మూవీరూల్జ్లో ప్రత్యక్షమవుతుంది. థియేటర్ సినిమాలకు ఐబొమ్మ కంటే ఇలాంటి వెబ్సైట్లు చేసే నష్టం అపారం. కాకపోతే ఐబొమ్మలా మూవీరూల్జ్‌కు ప్రచారం లేదు. కానీ ఇది కలిగిస్తున్న నష్టం ఎక్కువ. రవి అరెస్ట్ తర్వాత “మేము పైరసీలోనే సినిమాలు చూస్తున్నాం… దయచేసి మూవీరూల్జ్ నిర్వాహకులు పోలీసులకి చిక్కొద్దు” అనే పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. కొంతమంది జనాలు ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉన్నారో ఇలాంటి పోస్టులు చూసి అర్థం చేసుకోవచ్చు.
పైరసీ అనేది గ్లోబల్ సమస్య. ఇప్పటివరకు పైరసీ నుంచి పూర్తిగా విముక్తి పొందిన దేశం ఒక్కటీ లేదు. కాకపోతే కొన్ని దేశాల్లో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఒకరు పైరసీ సైట్‌ను ఓపెన్ చేస్తే వెంటనే పోలీసుల నుంచి కాల్స్ వెళ్తాయి. ఎందుకు ఓపెన్ చేశారో వివరణ ఇవ్వాలి. అదే రెండోసారి రిపీట్ అయితే ఫైన్ విధిస్తారు. ఇంకొన్ని దేశాల్లో పైరసీ ఫైల్ డౌన్లోడ్ చేయడం నేరం. దానికి జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేసినప్పుడు ఎంతలో కొంత ప్రజల్లో అవగాహన వస్తుంది.
దీంతో పాటు పైరసీ వెబ్సైట్ చూడడం వలన కలిగే నష్టాలపై కూడా అవగాహన కల్పించాలి. ఒక డివైస్‌లో పైరసీ సైట్ ఓపెన్ చేస్తే ఆ డివైస్‌లో ఉన్న ఫైల్లు అన్నీ క్లోన్ చేయబడే అవకాశం ఉంటుంది. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీలో కొన్ని అఫీషియల్ వెబ్సైట్లు, యాప్స్ వాడకంలోనే జనాలకు ప్రైవసీ ఉండదు. అలాంటప్పుడు పైరసీ వెబ్సైట్లను తరచూ బ్రౌజ్ చేయడం అంటే పరోక్షంగా పర్సనల్ డేటాను దొంగల చేతుల్లో పెట్టడమే. వీటన్నిటిపై జనాల్లో అవగాహన వస్తేనే పైరసీ సమూల నిర్మూలన సాధ్యమవుతుంది.
