గురువారం ప్రీమియర్లతో ‘రాజాసాబ్’ హడావుడి మొదలైపోయింది. సినిమాపై చాలా నెగిటీవ్ టాక్ నడుస్తోంది. ప్రభాస్ కరుడుగట్టిన ఫ్యాన్స్ కి సైతం ఈ సినిమా రిజల్ట్ మింగుడుపడడం లేదు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే… ఈ సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్ ని చిత్రబృందం పక్కన పెట్టడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభాస్ ముసలి గెటప్ లో ఓ లెంగ్తీ ఎపిసోడ్ తెరకెక్కించారు. దాదాపు 9 నిమిషాల పాటు సాగే సీన్ అది. అందుకోసం దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. పోస్టర్లలో ఆ ముసలి గెటప్ ఉంది. ట్రైలర్లోనూ చూపించారు. కానీ సినిమాలోనే లేదు. కనీసం ఆ సీన్లు ఉన్నా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యేవారు. అందుకే ఇప్పుడు మూకుమ్మడిగా ‘ఆ ఎపిసోడ్ ఏది’ అని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై ఒకటే రచ్చ.
నిజానికి చిత్రబృందం చాలా ఇష్టంతో తీసిన ఎపిసోడ్ ఇది. కాకపోతే కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టాల్సివచ్చింది. ఇప్పటికే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువైపోయింది. 3 గంటలు దాటేసింది. దాంతో బోర్ ఫీలవుతున్నారు. లెంగ్త్ తగ్గించాల్సింది అంటున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ పక్కన పెట్టారు. దాంతో పాటు లాంగ్ రన్ కోసం ఈ సీన్లు వాడుకొందామనుకొన్నారు. సంక్రాంతి సీజన్ అయిపోయిన తరవాత ఈ ఎపిసోడ్ మళ్లీ కలిపితే… ఇందుకోసమైనా రిపీట్ ఆడియన్స్ వస్తారని దర్శక నిర్మాతలు భావించారు. సంక్రాంతి అవ్వగానే ఈ ఎపిసోడ్ కలపాలి. అదీ.. ప్లాన్.
అయితే.. ఇప్పటికే ఈ సినిమాపై నెగిటీవ్ టాక్ వచ్చేసింది. ఎప్పుడో కలుపుతాం అనుకొంటే ప్రయోజనం లేదు. వీలైనంత త్వరగా ఆ సీన్లు యాడ్ చేస్తే.. కొత్తగా సినిమా చూసేవాళ్లకైనా కాస్త సంతృప్తి ఉంటుంది. ఫస్టాఫ్ లో అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని ఎడిట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు లెంగ్త్ ఇష్యూ కూడా ఉండదు.
