హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు, చెరువుల పునరుద్ధరణతో వార్తల్లో నిలిచిన హైడ్రా ఇప్పుడు తన పరిధిని విస్తరించింది. అగ్నిప్రమాదాలు జరగకుండా నిరోధించాలని రంగంలోకి దిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో వాణిజ్య, నివాస ప్రాంతాల్లో అగ్నిమాపక భద్రతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు ప్రారంభమయ్యాయి. నిబంధనలు పాటించని భవనాలపై ఉక్కుపాదం మోపుతామని, అగ్నిప్రమాద నివారణ చర్యలు లేని వాణిజ్య సముదాయాలకు తాళాలు వేయడంతో పాటు, తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
సీజ్ ద షాప్స్
తనిఖీలు ప్రారంభించిన రోజే జూబ్లీహిల్స్ లోని నీరూస్ షోరూమ్‌తో పాటు నాంపల్లిలోని పలు వాణిజ్య భవనాలను నిబంధనల ఉల్లంఘన కింద సీజ్ చేశారు. నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన ప్రమాదం మరోసారి జరగకూడదని రంగనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సెల్లార్లను గోదాములుగా మార్చడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోందని హైడ్రా గుర్తించింది. భవనాల్లోని సెల్లార్లు కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని, అక్కడ ఎలాంటి మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయకూడదని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మెట్లు, కారిడార్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాల్లో సరుకులు నిల్వ ఉంచితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
అగ్నిప్రమాద ముప్పు ఉన్న భవనం ట్యాగులు
భద్రతా ప్రమాణాలు పాటించని భవనాల ముందు అగ్నిప్రమాద ముప్పు ఉన్న భవనం అని ప్రజలను హెచ్చరించేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి దశాబ్దాలుగా ఫైర్ సేఫ్టీ విషయంలో భవనాలు పేరుకు మాత్రమే రూల్స్ పాటిస్తున్నాయి. ఆచరణలోకి వస్తే ఎవరూ పాటించడం లేదు. ఇప్పుడు అలా రూల్స్ పాటించని భవనాలపై హైడ్రా చర్యలు ప్రారంభించింది. అత్యంత సీరియస్ ఉల్లంఘనలు ఉన్న భవనాలను సీజ్ చేయాలన్నా రోజుకు వందల కొద్దీ సీజ్ చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజలూ ఫిర్యాదు చేయవచ్చు.. !
అగ్నిప్రమాదాల నివారణలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ హైడ్రా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. మీ పరిసరాల్లోని వాణిజ్య భవనాలు లేదా నివాస ప్రాంతాల్లో అగ్నిప్రమాద ముప్పు పొంచి ఉందని భావిస్తే, వెంటనే 90001 13667 నంబర్‌కు ఫొటోలు లేదా వీడియోలతో పాటు లొకేషన్ వివరాలను వాట్సాప్ చేయాలని కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏవీ రంగనాథ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ఈ కొత్త బాధ్యతలను స్వీకరించింది.
