అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. . గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించేందుకు ఎన్ని కుట్రలు చేసినా, వాటన్నింటినీ అధిగమించి నగరాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేదని, అందుకే వింత పేర్లతో సంబోధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్ మావిగన్ ప్రతిపాదనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. జగన్ కొత్తగా మావిగన్ అని ఏదో వింత పేరు పట్టుకొచ్చారు.. ఇంకా నయం దాన్ని వాటికన్ అనలేదు, ఆ రకంగా ఆ నగరం పరువు తీయనందుకు సంతోషించాలి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారో లేక కావాలనే బురద జల్లుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఒక సైకో పాలనలో నలిగిపోయిందని అన్నారు. ఇప్పటివరకు జగన్ ఒక్కడే సైకో అనుకున్నాం, కానీ ఇప్పుడు వైసీపీ నేతలంతా అదే బాటలో నడుస్తూ సైకోలుగా మారిపోయారు అని మండిపడ్డారు. తీవ్రవాదులు ఎక్కడో ఉండి అప్పుడప్పుడూ వచ్చి దాడి చేసి వెళ్ళినట్లుగా, జగన్ కూడా అప్పుడప్పుడూ ప్రత్యక్షమై ప్రజలపై, వ్యవస్థలపై దాడి చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న మీడియాపై వైసీపీ దాడులకు తెగబడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను విమర్శిస్తే సహించలేక జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సైతం అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్నారని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు.
