వరంగల్ రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయలేదని, రైతులను మోసం చేసిందని నిలదీయడానికి బీఆర్ఎస్ ఈ సభను ఏర్పాటు చేసింది. రైతు రుణమాఫీ, రూ. 15,000 పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలపై పక్కా ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కేటీఆర్‌కు ఉంది. కానీ, ఆయన ప్రసంగం అంతా వ్యక్తిగత దూషణలతో సాగిపోయింది. రేవంత్, రాహుల్‌పై వంటి తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంతో అసలు సమస్య అయిన రైతుల కష్టాలు కాకుండా కేటీఆర్ భాష హైలెట్ అవుతోంది.
నాలుగేళ్ల క్రితం వరంగల్ వచ్చిన రాహుల్ గాంధీ రైతులను గాలం వేశారని, కాంగ్రెస్ నాయకులు రైతు రక్తం తాగే దొంగలని కేటీఆర్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ హుందగా లేవు. అరేయ్ హౌలా..అరేయ్ దివానా..అంటూ ఆయన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కడంపై దృష్టి పెట్టారు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ హామీలపై శాస్త్రీయంగా పోరాటం చేయడంలో బీఆర్ఎస్ వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది. ప్రజా క్షేత్రంలోకి వెళ్లినప్పుడు లోతైన అధ్యయనంతో సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి, కేవలం తిట్లు, శాపనార్థాలకు పరిమితం కావడం పార్టీ కేడర్‌ను కూడా అయోమయానికి గురి చేస్తోంది.
బీఆర్ఎస్ వరంగల్ సభతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి ఉంది. కానీ కేటీఆర్ వాడిన భాష ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఆయుధంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీయడం చేతకాక, కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. మొత్తానికి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎస్టాబ్లిష్ చేయాల్సిన రైతు సంగ్రామ సభ.. కేటీఆర్ వ్యక్తిగత కోపతాపాలకు వేదికగా మారి, అసలు అంశాన్ని పక్కకు నెట్టేసింది. ఇప్పటికైనా భాష మార్చుకోకుండా, కేవలం తిట్లతోనే రాజకీయం చేయాలనుకుంటే అది బీఆర్ఎస్కే నష్టమని రాజకీయ వర్గాల చర్చ.


