ఐపీఎల్-2026 సీజన్లో అత్యంత సంచలనంగా నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్, ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మరో నాలుగు వ్యక్తిగత పురస్కారాలు అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అతని ముందు మరింత పెద్ద వేదిక సిద్ధమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతోంది. ఐపీఎల్లో మెరవడం ఒక ఎత్తయితే, అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ఫ్రాంచైజీ క్రికెట్లో చాలా మైదానాలు, పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి. దూకుడుగా ఆడే బ్యాటర్లకు అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా భిన్నమైన ప్రపంచం. అక్కడ ప్రతి బౌలర్ బ్యాటర్ బలహీనతలను అధ్యయనం చేస్తాడు. దూకుడును కట్టడి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
వైభవ్ ప్రతిభ గురించి ఇప్పటికే చాలామంది దిగ్గజాలు ప్రశంసించారు. ముఖ్యంగా అతని టైమింగ్, మణికట్టు ఆట, షాట్ సెలక్షన్ ఎంతో సహజంగా ఉంటాయని చెబుతున్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా వైభవ్‌లో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని ప్రశంసించడం చిన్న విషయం కాదు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసిన ఇన్నింగ్స్ కూడా అతని సామర్థ్యానికి నిదర్శనం.
కానీ క్రికెట్ చరిత్రను చూస్తే, ఐపీఎల్లో మెరిసి తర్వాత అదే స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగలేకపోయిన ఆటగాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ప్రారంభ విజయాలు అందరికీ వస్తాయి. అసలు సవాలు వాటిని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ప్రతి బ్యాటర్లో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది బౌలర్ పసిగడితే వికెట్ల ముందు దొరికిపోవడం ఖాయం. “నెక్స్ట్ సచిన్” అనే అంచనాలతో కెరీర్‌ను ప్రారంభించిన పృథ్వీ షా, ఇన్‌స్వింగర్ బంతులను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడి కెరీర్‌ను గాడిలో పెట్టుకోలేకపోయాడు.
అందుకే ఒక ఆటగాడికి తన లోపాలను సరిదిద్దుకోవడానికి, అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని అర్థం చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి. వైభవ్ విషయంలో భారత జట్టు మేనేజ్మెంట్, బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతనిపై అనవసరమైన అంచనాలు మోపకూడదు. 15 ఏళ్ల వయసులోనే అతను సాధించినది అసాధారణమే. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది, ఎదగాల్సింది చాలా ఉంది.
వైభవ్ లాంటి ప్రతిభావంతులు చాలా అరుదుగా దొరుకుతారు. అందుకే అతడిని కేవలం వచ్చే సిరీస్ కోసం కాకుండా, వచ్చే పదిహేను సంవత్సరాల భారత క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దాల్సిన అవసరం వుంది. ఐపీఎల్లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ… ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అతని ముందున్న అసలైన పరీక్ష.
