తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఇప్పుడు అందరి దృష్టి చిన్నమ్మ గా పేరొందిన ఆమె నెచ్చలి శశికళ నటరాజన్ పై పడింది. దగ్గరుండి ఆమెనే అంత్యక్రియలు జరపడం చూస్తే జయలలిత వారసత్వం కోసం ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు జయలలిత వెనుక ఉండి పార్టీ, ప్రభుత్వంపై సాధిస్తున్న ఆధిపత్యాన్ని కొనసాగించు కోవడం కోసం చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేయగలరని అర్ధం అవుతుంది.
గత మూడు దశాబ్దాలకు పైగా కష్టంలో, సంబరంలో జయను వెన్నంటి ఉంటున్న ఆమె ప్రాధాన్యత గల ఏ ఐ ఏ డి యం కె ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టే ప్రయత్నం చేయవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తొందర పడకుండా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2012లో జయలలిత ఇంటినుండి గెంటి వేసిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు మొత్తం 18 మంది అంత్యక్రియల సందర్భంగా చిన్నమ్మ వెంట ఉండటం గమనిస్తే వారందరితో కలసి పార్టీ, ప్రభుత్వంలను తమ తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. జయలలిత కేవలం చిన్నమ్మను మాత్రం క్షమించి తిరిగి ఇంటికి రానిచ్చినా, మిగిలిన వారెవ్వరిని క్షమించలేదని, వారెవ్వరిని జీవించి ఉన్నంతవరకు ఇంటివైపు రానీయలేదని అందరికి తెలుసు.
ఎటువంటి వివాదం లేకుండా ముఖ్యమంత్రిగా ఓ పన్నీరుసెల్వం నియామకం జరిగి, అధికార మార్పిడిని సుగమం చేయడం ద్వారా శశికళ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాంతీయ పార్టీలలో వారసత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజల దృష్టిలో వారసులు అంటే రక్త సంబంధం గల కుటుంబసభ్యులే గానే, స్నేహితులు మాత్రం కారు. అందుచేత జయ వారసురాలిగా ప్రజల ఆమోదం పొందడం తనకు కష్టమని చిన్నమ్మ గ్రహించినట్లు ఉంది.
అందుకనే ఆమె సన్నిహిత బంధువు ఒకరిని దగ్గరకు తీసి, వారి ద్వారా ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం ఈ సందర్భంగా కలుగుతున్నది.
అంత్యక్రియల సందర్భంగా ఆమె వెంటనే జయలలిత అన్న జయకుమార్ కుమారుడు దీపక్ ఉండటం ఈ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దానితో జయ మేనల్లుడు దీపక్ ను దగ్గరకు తీసి, అతని ద్వారా పార్టీలో పెత్తనం చేయాలని చిన్నమ్మ ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
రక్త సంబంధానికి వారసత్వాన్ని అంటగట్టి, ప్రక్కనే ఉండి అసలు అధికారం చెలాయించడం ఆమె ఎత్తుగడా? మరో కొన్ని రోజులు పోతే గాని వాస్తవం తెలియదు. గతంలో దీపక్ ను ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. కొద్దీ రోజుల క్రితమే ఆసుపత్రిలో ఉన్న మేనత్త జయలలితను చూడడానికి అతని సోదరి దీప వస్తే ఆమెను ఎవ్వరూ లోపలకు రానీయకుండా వెనుకకు గెంటివేశారు.
1995లో జయకుమార్ మృతి చెందినప్పటి నుండి ఆయన కుటుంబం మద్రాస్ లోని టి నగర్ లో సాధారణ జీవనం గడుపుతున్నారు. అన్న చనిపోయినప్పుడు వెళ్లిన జయలలిత తిరిగి ఆ కుటుంభం వైపు చూడనే లేదు.
