“కొత్తపలుకు” వెనుక గూడుపుఠాణి ఉందా..?

ఒకరికి గట్టి మద్దతుదారుగా ఉన్న వ్యక్తి.. ఆ వ్యక్తి గురించి ఎంత డబ్బా కొట్టినా…ఆ మామూలే కదా అనుకుంటారు. కానీ అదే వ్యక్తి.. వ్యతిరేకంగా… ఒక్క చిన్న మాట మాట్లాడినా అదో పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. అదే తీవ్రంగా మాట్లాడితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సెన్సేషనే… ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ.. తన పత్రికలో రాసిన “కొత్తపలుకు” వ్యాసం క్రియేట్ చేసింది. అందులోని భాష, భావం పూర్తిగా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విధానాన్ని .. కచ్చితంగా ప్రభావితం చేసి తీరాలన్నట్లుగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోవద్దని.. పొత్తులు పెట్టుకుంటే.. ఏపీలోకూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న హెచ్చరికలు పంపారు. అంతిమంగా చెప్పాలంటే.. అసలు తెలంగాణలో టీడీపీ పోటీ చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆ ఆర్టికల్ సారాంశం ఉంది.

ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. చర్చనీయాంశం అయింది. గత నెల చివరి ఆదివారం .. రాసిన కొత్తపలుకులో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. టీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఖాయమని ఇదే ఆర్కే విశ్లేషించారు. కింది స్థాయిలో టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నట్లుగా రాశారు. మరి అలాంటి పరిస్థితి నుంచి రెండంటే.. రెండు వారాల్లోనే… మార్పు ఎందుకు వచ్చింది..? కేసీఆర్‌కు తిరుగులేని పరిస్థితి ఉందని.. 80 సీట్లు వస్తాయని ఎందుకు తేల్చి చెప్పాల్సి వచ్చింది..?. ఇదే అందర్నీ ఆలోచింప చేస్తున్న అంశం. గతంలో టీవీ 9 చానల్‌లో ఓ సైటైరిక్ ప్రోగ్రాంలో అభ్యంతరకరంగా మాట్లాడారని… బ్యాన్ చేశారు. పనిలో పనిగా.. ఏమీ చేయకపోయినా.. ఏబీఎన్ పైనా వేటేశారు. ఇదంతా అనధికారికం. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా.. వచ్చిందా..? …అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి బిల్డింగ్ ప్రస్తుతం జనావాసాల మధ్య ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఆ భవనంలో… పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం కూడా జరిగింది. అప్పుడే… ఎలాంటి ఫైర్ సేఫ్టీ పాటించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటికే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలుండటంతో.. ఇబ్బందులు ఎదురు కాలేదు. ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీ ప్రారంభంలోనే ఓ ఆంధ్రజ్యోతికి నూతన కార్యాలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఆ స్థలం.. గతంలో ప్రభుత్వం కేటాయించిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా స్థలం విషయంలో లిటిగేషన్లు రావడంతో.. వాటిని పరిష్కరించినందుకే… “కొత్తపలుకు”లో ఇలా కొత్త రాగాలు వినిపించాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇందులో ఎంత నిజం ఉందో కానీ.. మొత్తానికి… “కొత్తపలుకు”లో మాత్రం.. సహజస్వభావమైన.. వాయిస్ మాత్రం వినిపించలేదని అందరూ నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com